Let's talk: editor@tmv.in
‘జన నాయగన్’ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడే: రాహుల్ గాంధీ

‘జన నాయగన్’ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడే: రాహుల్ గాంధీ

Pinjari Chand
14 జనవరి, 2026

విజయ్ నటించిన తమిళ సినిమా ‘జన నాయగన్’ ప్రదర్శనను అడ్డుకునేందుకు కేంద్రంలోని సమాచార–ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నం తమిళ సంస్కృతిపై నేరుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. అలాగే తమిళ ప్రజల గొంతును అణిచివేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికీ విజయవంతం కాలేరని ఆయన అన్నారు. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీకి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిన డివిజన్ బెంచ్ ఆదేశాన్ని సవాలు చేస్తూ, చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 9న మద్రాస్ హైకోర్టు, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ, సీబీఎఫ్‌సీ వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆదేశాలపై స్టే విధించింది. రాజకీయ కోణాలు ఉన్నాయని ప్రచారం పొందిన హీరో, రాజకీయ నాయకుడు విజయ్ చిత్రం ‘జన నాయగన్’భవితవ్యాన్ని ఈ ఆదేశం అనిశ్చితిలోకి నెట్టింది. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘జన నాయగన్’ను అడ్డుకునే ప్రయత్నం సమాచార–ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన తమిళ సంస్కృతిపై దాడి. మిస్టర్ మోడీ, తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని లోక్‌సభ ప్రతిపక్ష నేత వ్యాఖ్యనించారు.

సుప్రీం కోర్టులో సవాల్​

హైకోర్టు డివిజన్ బెంచ్ గత శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఆ ఉత్తర్వులతో సింగిల్ బెంచ్ సీబీఎఫ్‌సీకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన ఆదేశాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నటుడు విజయ్ ఇటీవలే తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) ను ప్రారంభించారు. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు ఆయన నటించే చివరి చిత్రంగా ప్రచారం పొందిన ‘జన నాయగన్’ను పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) నిర్ణీత సమయానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో చివరి నిమిషంలో ఈ సినిమా అడ్డంకులు ఎదుర్కొంది.

జనవరి 9న జస్టిస్ పీ.టి. ఆశా సీబీఎఫ్‌సీ వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించిన కొన్ని గంటలకే, డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలపై స్టే విధించింది. సీబీఎఫ్‌సీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎం.ఎం. శ్రీవాస్తవ, జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ఫస్ట్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును తాత్కాలికంగా నిలిపివేసింది. ముందుగా చిత్ర నిర్మాత అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ ఆశా, ఒకసారి సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించిన తర్వాత, చైర్‌పర్సన్‌కు ఆ విషయాన్ని రివ్యూ కమిటీకి పంపే అధికారం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలపై సీబీఎఫ్‌సీ వెంటనే అప్పీల్‌కు వెళ్లింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్‌ఎల్ సుందరేశన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, అప్పీల్‌కు సంబంధించిన కారణాలను డివిజన్ బెంచ్ ముందు వివరించారు. జనవరి 6న సీబీఎఫ్‌సీ నిర్మాతకు పంపిన లేఖ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు తెలిపింది. నేరుగా సవాలు చేయలేదని డివిజన్ బెంచ్ గమనించింది. అయినప్పటికీ సింగిల్ జడ్జి ఆ లేఖను కొట్టివేసి ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది. ఈ పిటిషన్ జనవరి 6న దాఖలైనప్పటికీ, సీబీఎఫ్‌సీకి సమాధానం దాఖలు చేయడానికి తగిన అవకాశం ఇవ్వలేదని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అందుకే స్టే విధిస్తూ, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.