Let's talk: editor@tmv.in
‘జన్మతః పౌరసత్వ’ రద్దుకు అమెరికా సుప్రీంకోర్టు నో?
‘జన్మతః పౌరసత్వ’ రద్దుకు అమెరికా సుప్రీంకోర్టు నో?

‘జన్మతః పౌరసత్వ’ రద్దుకు అమెరికా సుప్రీంకోర్టు నో?

Shaik Mohammad Shaffee
3 ఏప్రిల్, 2026

అమెరికా గడ్డపై జన్మించిన వారికి పుట్టుకతోనే లభించే పౌరసత్వాన్ని (జన్మతః పౌరసత్వం) రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై ఆ దేశ సుప్రీంకోర్టులో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. బుధవారం ఈ కేసుపై జరిగిన చారిత్రాత్మక విచారణలో ట్రంప్ నిబంధనలను కొట్టివేసేందుకు న్యాయమూర్తులు మొగ్గు చూపారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణకు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హాజరుకావడం విశేషం. దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినేందుకు స్వయంగా విచ్చేసిన తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఆయనతో పాటు అటార్నీ జనరల్ పామ్ బాండి, కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్, ప్రముఖ నటుడు రాబర్ట్ డి నీరో కూడా కోర్టు హాల్‌లో కనిపించారు.

న్యాయమూర్తుల ప్రశ్నల వర్షం

ట్రంప్ యంత్రాంగం తరఫున సాలిసిటర్ జనరల్ డి. జాన్ సౌర్ వాదనలు వినిపిస్తూ.. అక్రమ వలసదారులు, తాత్కాలికంగా అమెరికాలో ఉన్నవారి పిల్లలకు పౌరసత్వం కల్పించడం వల్ల 'బర్త్ టూరిజం' పెరుగుతోందని వాదించారు. అయితే దీనిపై ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ సహా ఇతర న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "డెలివరీ రూమ్‌లోనే పౌరసత్వ అర్హతను తేలుస్తారా?" అని జస్టిస్ కేతంజీ బ్రౌన్ జాక్సన్ ప్రశ్నించారు. 1868 నాటి 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ఎవరైనా పౌరులేనన్న నిబంధనను ట్రంప్ ఉత్తర్వు ఎలా అతిక్రమిస్తుందని న్యాయమూర్తులు నిలదీశారు. ట్రంప్ నియమించిన నీల్ గోర్సచ్, బ్రెట్ కావనా వంటి సంప్రదాయవాద న్యాయమూర్తులు సైతం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించకపోవడం గమనార్హం.

రాజ్యాంగం వర్సెస్ ట్రంప్

ట్రంప్ తన రెండో పదవీకాలం తొలి రోజే ఈ వివాదాస్పద ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికా పౌరసత్వం ఇచ్చే విషయంలో 1898 నాటి 'వాంగ్ కిమ్ ఆర్క్' కేసు తీర్పును ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంటోందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. విదేశీ రాయబారుల పిల్లలు మినహా అమెరికా నేలపై పుట్టిన అందరికీ పౌరసత్వం ఉంటుందని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అయితే అక్రమ వలసదారుల పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సౌర్ వాదించగా.. "ప్రపంచం మారినా రాజ్యాంగం మారదు కదా" అని చీఫ్ జస్టిస్ చురకలు అంటించారు. దాదాపు 35కి పైగా దేశాల్లో ఉన్న ఇటువంటి పౌరసత్వ నిబంధనను అమెరికాలో రద్దు చేయడంపై న్యాయస్థానం తీవ్రంగా ఆలోచిస్తోంది.

ట్రంప్ ఆగ్రహం.. 'ట్రూత్ సోషల్' వేదికగా విమర్శలు

కోర్టులో సుమారు గంటన్నర సేపు ఉన్న ట్రంప్, అవతలి పక్షం వాదనలు ప్రారంభమైన వెంటనే బయటకు వచ్చారు. అనంతరం తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో న్యాయమూర్తులపై విరుచుకుపడ్డారు. "పుట్టుకతో పౌరసత్వం ఇచ్చేంత తెలివితక్కువ దేశం ప్రపంచంలో మనదొక్కటే" అని వ్యాఖ్యానించారు. గతంలో తన సుంకాల నిర్ణయాన్ని కొట్టివేసినప్పుడు కూడా ఆయన న్యాయమూర్తులను 'దేశభక్తి లేనివారు' అంటూ విమర్శించారు. తాజాగా ఈ కేసులో కూడా ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో ఆయన ముందస్తుగానే న్యాయమూర్తులను లక్ష్యం చేసుకున్నారు.

భారీ ప్రభావం

ఒకవేళ ట్రంప్ ఉత్తర్వు అమలైతే, అమెరికాలో ఏటా జన్మించే సుమారు 2.5 లక్షల మంది చిన్నారులపై దీని ప్రభావం పడుతుంది. కేవలం అక్రమ వలసదారులే కాకుండా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు, హెచ్-1బి వీసాపై ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలకు కూడా పౌరసత్వం దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే న్యూ హాంప్‌షైర్ సహా పలు దిగువ కోర్టులు ఈ ఆంక్షలను నిలిపివేశాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

జులైలో తుది తీర్పు!

ప్రస్తుత వాదనల సరళిని బట్టి చూస్తే, ట్రంప్ తన అధ్యక్ష అధికారాలను అతిగా ఉపయోగిస్తున్నారని కోర్టు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. పౌరసత్వం వంటి కీలక అంశాల్లో రాజ్యాంగ సవరణ అవసరమని, కేవలం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుతో దానిని మార్చలేమని న్యాయమూర్తులు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ లేదా జులై ప్రారంభంలో వెలువడే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్ రెండో ఇన్నింగ్స్‌లో వలస విధానాలపై ఆయనకు ఎదురవుతున్న అతిపెద్ద చట్టపరమైన పరీక్షగా ఈ కేసు నిలవనుంది.