
జనావాసాల్లోకి పెద్దపులి..అప్రమత్తమైన హనుమాన్ బృందాలు
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అలజడి సృష్టిస్తున్న పెద్దపులి మరోసారి జనావాసాల వైపు అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతం నుంచి పులి తిరిగి గ్రామాల దిశగా వస్తున్నట్లు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో కూర్మాపురం సమీపంలో ఈ పులిని బంధించిన అధికారులు నిపుణుల సూచనల మేరకు దాని మెడకు రేడియో కాలర్ అమర్చి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే తాజాగా అందుతున్న సిగ్నల్స్ ప్రకారం అది తిరిగి జనావాసాలకు చేరువవుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ పరిణామాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. పులి కదలికలపై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన తక్షణమే ‘ హనుమాన్’ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పులి వల్ల ప్రజలకు గానీ పశువులకు గానీ ఎలాంటి హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించే బాధ్యతను పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావుకు అప్పగిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
పులిని సురక్షితంగా బంధించేందుకు రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక ‘హనుమాన్’ బృందాలను రంగంలోకి దించారు. రేడియో కాలర్ నుంచి అందుతున్న సందేశాల ఆధారంగా పులి ప్రస్తుత లొకేషన్‌ను ఈ బృందాలు నిరంతరం ట్రాక్ చేస్తున్నాయి. జనారణ్యంలోకి పులి ప్రవేశించక ముందు దానిని పట్టుకుని ఈసారి సురక్షితంగా విశాఖపట్నం జూ పార్కుకు తరలించాలని డిప్యూటీ సీఎం సూచించారు. అడవిలో వదిలినా అది తిరిగి గ్రామాల వైపు వస్తున్న నేపథ్యంలో, ప్రజల రక్షణ దృష్ట్యా దానిని జూలోనే ఉంచడం ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది.
