
జనాభా గణనలో కలెక్టర్లదే కీలక పాత్ర: డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్
దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన జనాభా లెక్కల సేకరణ (సెన్సస్–2027) ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రధాన పాత్ర పోషించాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయ డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ వి.వి.ఎల్.ఎన్. శర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
2027లో నిర్వహించబోయే ఈ జనాభా గణన దేశ చరిత్రలో 16వది కాగా స్వాతంత్రం అనంతరం 8వదని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జనాభా లెక్కల వ్యవస్థ భారత్‌కు ప్రత్యేక గుర్తింపని పేర్కొన్నారు. ఈ విస్తృత ప్రక్రియ విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ గణన
కాగా ఈసారి జనాభా లెక్కల సేకరణలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో గణన చేపట్టనున్నారు. మొబైల్ అప్లికేషన్లు, ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా డేటా సేకరణ జరుగుతుందని డా. శర్మ వెల్లడించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రెండు దశల్లో జనగణన
రానున్న జనగణన రెండు దశల్లో జరుగుతుందని అధికారులు తెలిపారు. మొదటి దశగా ‘హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, రెండో దశగా ‘పాపులేషన్ ఎన్యుమరేషన్’ నిర్వహించనున్నారు. గృహ వివరాలు, అనంతరం కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమగ్ర శిక్షణ కీలకమని డా. శర్మ స్పష్టం చేశారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్ల ఖరారు, జిల్లా సెన్సస్ అధికారులు, చార్జ్ అధికారుల శిక్షణపై చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నుంచి జారీ అయిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
సమన్వయంతోనే విజయవంతం
రాష్ట్ర నోడల్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో డిజిటల్ గణనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో ఖచ్చితమైన వివరాల సేకరణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక బాధ్యతతో పర్యవేక్షణ చేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాల వారీగా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు యుద్ధప్రాతిపదికన సన్నద్ధత చర్యలు చేపట్టాలని కోరారు.
