
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా మరింతగా పార్టీని విస్తరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ అవిర్భావ దినోత్సవం మార్చి 14న ఉండడం, అంతకంటే ముందే పార్టీ క్రియాశీలక సభ్యత్వల నమోదును పూర్తి చేసి, సభ్యుల సంఖ్యను పెంచుకోని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కోసం రూ.2 కోట్లు విరాళంగా అందించి, తొలి సభ్యత్వాన్ని ఆయనే స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వారే పార్టీకి అవసరమని తెలిపారు.
సభ్యులకు పిలుపు
పార్టీ సిద్ధాంతాలను అంగీకరించి సభ్యత్వం తీసుకునే వారిని ఇకపై మూడు వర్గాలుగా పిలుస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యమి – పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని, సిద్ధాంతాల కోసం ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే వారు. సాధక్ – పార్టీ పోరాటాలకు బలాన్ని అందించి, యువతలో ప్రేరణ కలిగిస్తూ సభ్యత్వ నమోదు చేపట్టేవారు. ప్రదాత – పార్టీ ప్రజా, రాజకీయ పోరాటాలకు సమయం, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథో సహకారం అందించే వారు.
సభ్యత్వాల పెరుగుదల
పార్టీ ప్రారంభ దశలో కేవలం 150 మందితో ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం చేపట్టినప్పుడు 90 వేల మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరగా, ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని వెల్లడించారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేసే వారు, కూలి పనులు చేసే వారు, చదువుకున్న యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన కార్యకర్తల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తంగా, జనసేన పార్టీ బలోపేతానికి ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
