Let's talk: editor@tmv.in
జనవరి 11న సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోడీ

జనవరి 11న సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోడీ

Pinjari Chand
6 జనవరి, 2026

గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 11న సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ‘సోమనాథ్ స్వాభిమాన పర్వ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. విదేశీ ఆక్రమణదారుల దాడులతో మారు మారు ధ్వంసమైనప్పటికీ అనేక సార్లు పునర్నిర్మించిన ఈ ఆలయం భారతీయ నాగరికత అజేయ ఆత్మకు ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్‌లో అరేబియా సముద్ర తీరంలో ఉన్న శివాలయమైన సోమనాథ్ ఆలయంలో జనవరి 8 నుంచి 11 వరకు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

భారత నాగరికత ఆత్మకు సోమనాథ్ నిదర్శనం

సోమనాథ్ ఆలయంపై తొలి దాడి జరిగిన 1,000 ఏళ్ల సందర్భంగా రాసిన తన బ్లాగ్‌లో ప్రధాని మోడీ అనేక కష్టాలు, సవాళ్లను అధిగమిస్తూ గర్వంగా నిలిచిన సోమనాథ్ ఆలయం భారతీయ నాగరికత అజేయ ఆత్మకు అత్యుత్తమ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. పునరావృత దాడులు జరిగినప్పటికీ ఆలయం అచంచలంగా నిలవడానికి కారణం, భారతమాత సంతానమైన అనేక మంది చూపిన అపార ధైర్యం, సంస్కృతి–నాగరికతలపై ఉన్న గొప్ప విశ్వాసమేనని ఆయన తెలిపారు. దేశం నేడు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ప్రకాశవంతమైన కేంద్రంగా ఎదగడం వెనుక కూడా అదే ఆత్మశక్తి ఉందని మోడీ చెప్పారు. ప్రపంచం భారత్ వైపు ఆశతో, నమ్మకంతో చూస్తోంది. మన యువత వినూత్న ఆలోచనలపై పెట్టుబడులు పెట్టాలని ప్రపంచం కోరుకుంటోందని ఆయన అన్నారు.

భారత కళలు, సంస్కృతి, సంగీతం, పండుగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని, యోగా, ఆయుర్వేదం ప్రపంచ ఆరోగ్య జీవన విధానంపై ప్రభావం చూపుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కూడా భారత్ నుంచే వస్తున్నాయని అన్నారు.

గతంలో దాడులు చేసిన ఆక్రమణదారులు నేడు చరిత్రలో కలిసిపోయారని , వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మారాయని విమర్శించారు. కానీ సోమనాథ్ ఆలయం నేటికీ వెలుగులు విరజిమ్ముతూ, 1026లో జరిగిన దాడి కూడా భారతీయ ఆత్మను అణచలేకపోయిందని ప్రపంచానికి చాటి చెబుతోందని ఆయన అన్నారు. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో ‘వికసిత భారత్’ నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నామని, భారతీయ నాగరికత జ్ఞానం ప్రపంచ సంక్షేమానికి మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు.

చరిత్రను గుర్తు చేస్తూ 1024 ఏడీలో టర్కీ పాలకుడు మహ్మద్ గజనీ సహా అనేక మార్లు సోమనాథ్ ఆలయం దాడులకు గురైందని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఆలయ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 1947లో దీపావళి సమయంలో సోమనాథ్ సందర్శన సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ పటేల్ సంకల్పం ప్రకటించారని, 1951 మే 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఆలయం భక్తులకు తలుపులు తెరిచిందని వివరించారు. అయితే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ కార్యక్రమంపై అంతగా ఆసక్తి చూపలేదని, రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడాన్ని ఆయన ఇష్టపడలేదని విమర్శించారు. అయినప్పటికీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దృఢంగా నిలబడ్డారని చెప్పారు.