Let's talk: editor@tmv.in
జనవరి 1 నుంచే భాగ్యనగరంలో 'నుమాయిష్'

జనవరి 1 నుంచే భాగ్యనగరంలో 'నుమాయిష్'

Gaddamidi Naveen
29 డిసెంబర్, 2025

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ 85వ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ పారిశ్రామిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తుప్రదర్శన జనవరి 1న జరగనున్న ప్రారంభోత్సవాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

ఈసారి నుమాయిష్‌లో దేశవ్యాప్తంగా సుమారు 1,050 మంది తయారీదారులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. వీరితో పాటు స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హస్తకళలు, గృహోపకరణాలు, వస్త్రాలు, పారిశ్రామిక ఉత్పత్తులు వంటి అనేక రకాల వస్తువులు ప్రదర్శనలో ఆకర్షణగా నిలవనున్నాయి.

అదేవిధంగా, వివిధ ప్రభుత్వ శాఖలు కూడా తమ సేవలు, పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. సందర్శకుల కోసం 20 ప్రత్యేక ఆహార స్టాళ్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా వివిధ రకాల వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఈ ఏడాది నుమాయిష్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత, సౌకర్యాల పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర, దేశవ్యాప్తంగా వచ్చే సందర్శకులకు ఈ ప్రదర్శన ఒక విశేష అనుభవాన్ని అందించనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

జనవరి 1 నుంచే భాగ్యనగరంలో 'నుమాయిష్' - Tholi Paluku