Let's talk: editor@tmv.in
‘జననాయగన్’ ఆన్‌లైన్ లీక్ కేసులో ఆరుగురు అరెస్ట్

‘జననాయగన్’ ఆన్‌లైన్ లీక్ కేసులో ఆరుగురు అరెస్ట్

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, ప్రముఖ నటుడు విజయ్‌ నటించిన చిత్రం జననాయగన్‌ ఆన్‌లైన్‌లో లీక్ అయిన కేసులో తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం ఆరుగురిని అరెస్ట్ చేసింది. సినిమా థియేటర్లలో విడుదలకు ముందే హెచ్‌డీ క్వాలిటీలో ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ కేసు నమోదు చేసి ఏప్రిల్ 12న నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్‌. వినోద్‌ తెరకెక్కించగా, కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ నిర్మించింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ముందు విజయ్ నటించిన చివరి చిత్రం ఇదేనని ప్రచారం జరిగింది.

పోలీసుల ప్రకారం నిందితులపై బీఎన్‌ఎస్‌ , సమాచార సాంకేతిక చట్టం, కాపీరైట్ చట్టం, సినిమాటోగ్రాఫ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నందున అరెస్టయిన వారి పేర్లను ఇప్పట్లో వెల్లడించలేమని అధికారులు తెలిపారు. ఈ కేసులో డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పైరేటెడ్ కాపీలను అప్‌లోడ్ చేసి, డ్రైవ్ లింకుల రూపంలో పంచినట్టు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఈ కేసులో భాగంగా 300కు పైగా పైరసీ లింకులను బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది. సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. పైరేటెడ్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, స్ట్రీమ్ చేయడం లేదా షేర్ చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు కనిపిస్తే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.