
జనగామ జిల్లాలో బైక్‌పై కలెక్టర్ క్షేత్ర పర్యటన
మొన్నటి వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మైదాన పర్యటన నిర్వహించారు. మెంథా ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల గ్రామీణ రహదారులు దెబ్బతినడంతో, కలెక్టర్ స్వయంగా బైక్‌పై ప్రయాణించి బాధిత గ్రామాలను సందర్శించడం విశేషం.
కలెక్టర్ కోడకండ్ల మండలంలోని నర్సింగాపురం, ఎదునుతాల గ్రామాలు,అలాగే పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామాలను సందర్శించి వరి, పత్తి, టమాటా పంటల నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని తక్షణ సాయంపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు గ్రామ స్థాయిలోనే రైతులతో కలిసి పని చేయాలని, ప్రతి పంట నష్టాన్ని రైతు భరోసా యాప్ ద్వారా ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నష్టపరిహార లెక్కలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
తాజా తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా, ఇప్పటికే కోత పూర్తయిన ధాన్యాన్ని రైతులు వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తిగా తడిసిన లేదా రంగు మారిన ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు పంట కొనుగోలు కేంద్రాల మేనేజర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.
తర్వాత ఆయన నర్సింగాపురంలోని తిరుమల రైస్ మిల్‌ను సందర్శించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సమయంలో అనవసర కోతలు పెట్టవద్దని రైస్ మిల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తడి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ప్రతి కేంద్రంలో తగిన టార్పాలిన్లు సిద్ధంగా ఉంచి వర్షం వల్ల మరిన్ని నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తడి ధాన్యం స్వీకరణలో ఇబ్బందులు
వర్షాల వల్ల ధాన్యం తడవడంతో, కొనుగోలు కేంద్రాలు దానిని స్వీకరించడంలో వెనుకంజ వేస్తున్నాయి.మిల్లర్లు తడి ధాన్యం కొనుగోలుకు నిరాకరించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.తేమ శాతం ఎక్కువగా ఉందని చూపించి ధాన్యాన్ని తిరస్కరించడం లేదా కోతలు పెట్టడం జరుగుతోంది.కొన్నిసార్లు తూకం యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్ల రైతులపై అన్యాయం జరుగుతోందని అందుకే కలెక్టర్ రైస్ మిల్లర్లుకు హెచ్చరించారు.
