
జనగామ జిల్లాలోకి ప్రవేశించిన పులి
గత 20 రోజులుగా హైదరాబాద్ సమీపంలోని యాదాద్రి-భువనగిరి జిల్లా వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన పులి, ఇప్పుడు జనగామ జిల్లాలోకి ప్రవేశించింది. గురువారం ఉదయం జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలంలోని ఒక గ్రామంలో పులి పాదముద్రలను గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి కొండల్ రెడ్డి ధృవీకరించారు. ఈ పులి జనవాసాలున్న ప్రాంతాల్లోనే పెరిగినట్లు కనిపిస్తోందని, అందుకే ఇది ఊర్ల వైపు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పులి కదలికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువుల పాకల వద్ద జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో పులి సంచరించడం గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ మగ పులి, యాదాద్రి జిల్లాకు చేరుకోవడానికి సుమారు 250 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. రోజుకు సగటున 20 నుండి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ క్రూర మృగం, ఇప్పటివరకు మనుషులపై దాడి చేయనప్పటికీ, యాదాద్రి జిల్లాలో ఎనిమిది పశువులను పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతానికి ఈ పులి జనగామ వైపు అడుగులు వేస్తుండటంతో అటవీశాఖ బృందాలు దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
