Let's talk: editor@tmv.in
జనగణన–2027 కోసం మస్కట్లు ఆవిష్కరణ

జనగణన–2027 కోసం మస్కట్లు ఆవిష్కరణ

Pinjari Chand
6 మార్చి, 2026

దేశంలో నిర్వహించనున్న జనగణన-2027 కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిటల్ సాధనాలు, ప్రత్యేక మస్కట్లను న్యూఢిల్లీలో గురువారం సాఫ్ట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘ప్రగతి’ (మహిళ) ‘వికాస్’ (పురుషుడు) అనే రెండు మస్కట్లను ఆవిష్కరించారు. వీటి ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు జనగణనపై అవగాహన కల్పించడంతో పాటు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మహిళలు-పురుషులు సమాన భాగస్వాములని ప్రతిబింబిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన

భారతదేశంలో జరగనున్న సెన్సస్–2027 ప్రపంచంలోనే అతిపెద్ద జనగణనగా ఉంటుంది. 2027 జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈసారి జనగణనలో ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన నిర్వహిస్తారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు

సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం

సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ప్రజలు ఇంటి వద్దకు అధికారులు రాకముందే తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వెబ్ ఆధారిత పోర్టల్‌లో 16 భాషల్లో సమాచారం నమోదు చేయవచ్చు. వివరాలు సమర్పించిన తర్వాత సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ జారీ అవుతుంది. ఆ ఐడీ ఆధారంగా ఎన్యుమరేటర్లు సమాచారం ధృవీకరిస్తారు.

నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభం

జనగణన ప్రక్రియను సులభతరం చేయడానికి నాలుగు డిజిటల్ టూల్స్‌ను ప్రారంభించారు.

హౌస్‌లిస్టింగ్‌ బ్లాక్ క్రియేటర్ (హెచ్‌ఎల్‌బీసీ) వెబ్ యాప్

ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గృహాల లెక్కింపు బ్లాక్‌లను రూపొందించే మ్యాప్ అప్లికేషన్.

హెచ్‌ఎల్‌ఓ మొబైల్ యాప్

ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించడానికి ఉపయోగించే సురక్షిత మొబైల్ యాప్.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో పనిచేస్తుంది; 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.

సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్

ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సదుపాయం.

సెన్సెస్‌ మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (సీఎంఎంఎస్‌) పోర్టల్

జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జనగణన పనులను పర్యవేక్షించే కేంద్రికృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్.

30 లక్షల మందికి పైగా అధికారులు

దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణ కోసం 30 లక్షలకు పైగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, అధికారులు పని చేయనున్నారు.

రెండు దశల్లో జనగణన

దశ-1:

హౌస్‌లిస్టింగ్ అండ్ హౌసింగ్ జనగణన

తేదీలు: ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య

ఇళ్ల పరిస్థితులు, గృహ సదుపాయాలపై సమాచారం సేకరణ

దశ-2: జనాభా లెక్కింపు

• దేశవ్యాప్తంగా: ఫిబ్రవరి 2027

• వ్యక్తుల సామాజిక, ఆర్థిక, జనాభా వివరాల సేకరణ

• ఈ దశలో కుల సంబంధిత ప్రశ్న కూడా ఉంటుంది.

ప్రత్యేక ప్రాంతాల్లో ముందుగానే లెక్కింపు

లడఖ్, జమ్ము-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడే ప్రాంతాల్లో జనాభా లెక్కింపు సెప్టెంబర్ 2026లోనే జరుగుతుంది.

రిఫరెన్స్ తేదీ

దేశంలోని ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనగణన రిఫరెన్స్ తేదీ 2027 మార్చి 1 అర్ధరాత్రిగా నిర్ణయించారు.

లడఖ్, మంచు ప్రాంతాలకు మాత్రం 2026 అక్టోబర్ 1గా నిర్ణయించారు.ఈసారి డిజిటల్ సాంకేతికత వినియోగంతో జనగణన మరింత ఖచ్చితంగా, వేగంగా, పారదర్శకంగా నిర్వహించగలమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

జనగణన–2027 కోసం మస్కట్లు ఆవిష్కరణ - Tholi Paluku