
జనగణన వ్యక్తిగత సమాచారం గోప్యమే: జనగణన కమిషనర్
దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న 16వ జనగణన నేపథ్యంలో ప్రజలు సరైన సమాచారం ఇవ్వాలని మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనగణన సమయంలో సేకరించే వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, వాటిని ఎటువంటి పథకాల లాభాలు పొందడానికి లేదా కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించలేమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి 16వ జనగణన మొదటి దశ ప్రారంభమవుతుందని తెలిపారు. జనగణన చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం వ్యక్తిగత సమాచారమంతా గోప్యంగానే ఉంటుందని చెప్పారు. జనగణనలో సేకరించే వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోరు. అవి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు దేనికి ఇవ్వరు. సమాచారం హక్కు చట్టం కింద కూడా వాటిని ఇవ్వలేం. కోర్టులో సాక్ష్యంగా కూడా ఉపయోగించలేమని నారాయణ్ చెప్పారు. జనగణనలో సేకరించిన సమాచారం మొత్తం గణాంకాల రూపంలో మాత్రమే ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.
రెండో దశలో కుల వివరాలు
జనగణనలో కుల వివరాలు చేర్చుతారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కులానికి సంబంధించిన సమాచారం రెండో దశలో సేకరిస్తామని చెప్పారు. దీనిపై పలు సూచనలు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలించి తుది ప్రశ్నలను నిర్ణయిస్తామని తెలిపారు. వ్యక్తిగత సమాచారం ఏ పథకంలోనూ లబ్ది పొందడానికి ఉపయోగించలేరు. కేవలం గణాంకాల రూపంలో మాత్రమే ప్రచురిస్తాం. అందువల్ల సమాచారం తారుమారు చేసే అవకాశం లేదని ఆయన చెప్పారు. దేశంలో చివరిసారిగా 1881 నుంచి 1931 మధ్య జరిగిన జనగణనల్లో కుల గణన చేపట్టారు. స్వాతంత్ర్యం తరువాత జరిగిన జనగణనల్లో కుల గణనను నిలిపివేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ రాబోయే జనగణనలో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది.
డిజిటల్ భద్రతకు కఠిన చర్యలు
జనగణన సమయంలో సేకరించే సమాచార భద్రత కోసం కఠిన చర్యలు తీసుకున్నామని నారాయణ్ తెలిపారు. భారత ప్రభుత్వ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డిజిటల్ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సేకరించమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు స్వయంగా సమాచారం ఇవ్వగలిగే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ విధానాన్ని కూడా తొలిసారిగా ప్రవేశపెట్టామని తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత కూడా గణకులు ఇంటింటికీ వెళ్లి సమాచారాన్ని ధృవీకరిస్తారని చెప్పారు. ప్రతి ఆరుగురు గణకులకు ఒక సూపర్‌వైజర్ ఉండే విధంగా రెండంచెల పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుందని వివరించారు.
ఏప్రిల్ నుంచి మొదటి దశ
దేశవ్యాప్తంగా ఇళ్ల జాబితా, ఇళ్ల పరిస్థితుల వివరాల సేకరణ మొదటి దశలో జరుగుతుంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య రాష్ట్రాలు నిర్ణయించిన 30 రోజుల వ్యవధిలో నిర్వహిస్తారు.
ఢిల్లీ లో రెండు విడతలుగా.
న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పరిధిలో మే 16 నుంచి జూన్ 15 వరకు
సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆయా ప్రాంతాల్లో ముందుగా 15 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 33 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇళ్ల పరిస్థితులు, ఇంటి యజమాన్యం, గదుల సంఖ్య, కుటుంబ వివరాలు వంటి సమాచారం సేకరిస్తారు. ఈ దశలో కులం లేదా మతం వంటి వివరాలు అడగరు.
గణాంకాలు 2027లో విడుదల
ఈసారి జనగణన డిజిటల్ విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. గతంలో పేపర్ రూపంలో సేకరించిన సమాచారాన్ని డిజిటల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేదని చెప్పారు. ఇప్పుడు మొదటి నుంచే డిజిటల్ రూపంలో డేటా సేకరిస్తుండడంతో గణాంకాలను త్వరగా విడుదల చేయగలమని తెలిపారు. అనేక గణాంకాలను 2027లోనే విడుదల చేసే అవకాశం ఉందన్నారు. జనాభా గణన దశలో జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వలసలు, సంతానోత్పత్తి వంటి వివరాలు సేకరిస్తారు. ఈ భారీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల గణకులు, పర్యవేక్షకులు, మరో 1.3 లక్షల జనగణన అధికారులు పాల్గొంటారు. ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ జనగణన 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
జనగణనలో ‘లివ్-ఇన్’ జంటలకు వివాహితుల హోదా
రాబోయే 16వ జనగణనలో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’లో ఉన్న జంటలు తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావిస్తే వారిని వివాహితులుగా పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనగణన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) పోర్టల్‌లో విడుదల చేసిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూ) విభాగంలో ఈ విషయం వెల్లడైంది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఎఫ్‌ఏక్యూలో ‘లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్న జంటను వివాహితులుగా పరిగణిస్తారా?’ అనే ప్రశ్నకు సమాధానంగా వారు తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావిస్తే వివాహితులుగా నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఇళ్లకు సంబంధించిన వివరాలు ఎలా నమోదు చేయాలి?
• పోర్టల్‌లో గృహ నిర్మాణానికి సంబంధించిన కొన్ని క్లిష్ట ప్రశ్నలకు కూడా సూచనలు ఇచ్చారు. ఉదాహరణకు:
• ఒక ఇంట్లో వేర్వేరు గదుల్లో వేర్వేరు ఫ్లోరింగ్ ఉంటే అధికంగా ఉపయోగించిన ఫ్లోరింగ్ పదార్థాన్ని నమోదు చేయాలి.
• ఉదాహరణకు డ్రాయింగ్ రూమ్‌లో మాత్రమే మోసాయిక్ ఉండి మిగతా గదుల్లో సిమెంట్ ఉంటే ‘సిమెంట్’ అని నమోదు చేయాలి.ఇంట్లో మార్బుల్ ఫ్లోరింగ్ ఉన్నా ఎంపికల్లో లేకపోతే ‘స్టోన్’ ఎంపిక చేయాలని సూచించారు.
• గోడలు బాంబూ లేదా ఎక్రాతో నిర్మించబడితే ‘గ్రాస్/థాచ్/బాంబూ’ అనే ఎంపికను ఎంచుకోవాలని చెప్పారు.
కులం, గదులు, నీటి వనరులపై సూచనలు
• రాష్ట్ర జాబితాలో కులం లేదా తెగ పేరు లేకపోతే ‘ఇతరులు’ఎంపికను ఎంచుకోవాలి.
• కుటుంబ సభ్యుడితో గది పంచుకుంటే అది ప్రత్యేక నివాస గదిగా లెక్కించరాదు.
• ట్యాప్ నీటిని సీసాల్లో నిల్వ ఉంచినా అది బాటిల్ నీరు కాదు, ఇంకా ట్యాప్ నీరే అని పరిగణించాలి.
మొబైల్‌లో ఎఫ్‌ఎం ఉన్నా ‘రేడియో’గా పరిగణన
మొబైల్ ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో ఉంటే అది రేడియో సౌకర్యంగా నమోదు చేయాలని ఎఫ్ఏక్యూలో పేర్కొన్నారు. అలాగే సంగీత పరికరమైన ‘కర్వాన్’ వంటి వాటిని ‘ఇతర పరికరం’గా నమోదు చేయాలని సూచించారు.
మొదటి దశలో అడిగే ప్రశ్నలు
మొత్తం 33 ప్రశ్నలు అడగనున్నారు. వాటిలో ముఖ్యంగా:
• ఇంటి నంబర్, భవనం నంబర్
• ఫ్లోర్, గోడలు, పైకప్పు నిర్మాణానికి వాడిన మెటిరీయల్
• కుటుంబంలో నివసించే వ్యక్తుల సంఖ్య
• కుటుంబ యజమాని పేరు, లింగం
• కుటుంబం వినియోగించే ధాన్యం రకం
• వాహనాలు, ప్రాథమిక సౌకర్యాలు
