Let's talk: editor@tmv.in
జనగణనలో ఓబీసీలను లెక్కించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

జనగణనలో ఓబీసీలను లెక్కించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన మొదటి విడతలో ఓబీసీ కులాలను లెక్కించకుండా మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను మాత్రమే లెక్కిస్తూ, మిగతా వారిని ఇతరులుగా చూపించడం ఓబీసీలను తీవ్ర అన్యాయానికి గురిచేయడమేనని మండిపడ్డారు. దేశానికి బీసీ ప్రధాన మంత్రి ఉన్నప్పటికీ, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని, కానీ వారి రాజకీయ పురోగతికి ఏమాత్రం సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలంటే కుల గణన అనివార్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఓబీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.