Let's talk: editor@tmv.in
జనగణనకు రాష్ట్రాలు అధికారులను నియమించాలి:ఆర్జీఐ

జనగణనకు రాష్ట్రాలు అధికారులను నియమించాలి:ఆర్జీఐ

Pinjari Chand
10 డిసెంబర్, 2025

2027 జనగణనకు అవసరమైన విస్తృతమైన డేటా సేకరణ కార్యక్రమం కోసం నియమించాల్సిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకాన్ని 2026 జనవరి 15లోపే పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) తాజా సర్క్యులర్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. జనగణనలో ప్రధాన పాత్ర పోషించే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు బాధ్యతల పంపిణీపై కూడా వివరమైన మార్గదర్శకాలను సర్క్యులర్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ భారీ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సుమారు 30 లక్షల ఫీల్డ్ సిబ్బందిని నియమించనున్నారు.

• ఒక్క ఎన్యూమరేటర్‌కు 700–800 జనాభా బాధ్యత

• ప్రతి ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్

• 10శాతం రిజర్వు సిబ్బంది కూడా ఉండాలి

1990 జనగణన నియమావళి ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు, క్లర్కులు వంటి వారు ఎన్యూమరేటర్లుగా నియమించవచ్చని, సూపర్ వైజర్ మాత్రం వారికంటే ఉన్నత పదవిలోని అధికారి ఉండాలన్న ఆదేశాలు చెబుతున్నాయి.

గణనలో పాల్గోనే అధికారులు

• జిల్లా కలెక్టర్లు / జిల్లా మేజిస్ట్రేట్లు — ప్రిన్సిపల్ జనగణన అధికారులు

• డివిజన్ ఉన్న చోట — డివిజనల్ కమిషనర్లు — డివిజనల్ జనగణన అధికారులు

• మునిసిపల్ కమిషనర్లు / నగర సంస్థల ప్రధానులు — ఆయా పరిధిలో జరిగే పనులకు ఇన్‌చార్జ్ అధికారులు

డిజిటల్ జనగణన – సీఎంఎంఎస్ పోర్టల్

ఆర్జీఐ జనగణన 2027 నిర్వహణ కోసం సెన్సెస్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనే వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ ద్వారా ఎన్యూమరేటర్లు–సూపర్వైజర్ల నియామించి, వారికి బ్లాకులు, సర్కిల్స్ కేటాయించడం, రియల్‌టైమ్ ఫీల్డ్ వర్క్ మానిటరింగ్ కేటాయించడం మొదలైనవి నిర్వహిస్తారు.

జనగణన 2027 – రెండు దశల్లో జరగనుంది.

మొదటి దశ: ఏప్రిల్ –సెప్టెంబర్ 2026

ఇంటి జాబితా, హౌసింగ్ జనగణన (రాష్ట్రాల సౌకర్యం మేరకు 30 రోజులు) రెండో దశ: ఫిబ్రవరి 2027 జనాభా లెక్కింపు జరుగుతుంది. లడఖ్, జమ్మూ-కాశ్మీర్‌లో మంచు కురిసే ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మినహాయించారు . వీటిలో సెప్టెంబర్ 2026లో లెక్కింపు పూర్తవుతుంది.2024 ఏప్రిల్ 30న క్యాబినెట్ కమిటీ ఆమోదించిన నిర్ణయం మేరకు ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్‌గా జరిగేలా, అలాగే కుల సమాచారం కూడా నమోదు చేయనున్నారు.

వలస కార్మికుల గణనకు ప్రత్యేక ఏర్పాట్లు లేవు: కేంద్రం స్పష్టీకరణ

2027 జనగణనలో వలస కార్మికులు, తాత్కాలిక నివాసితుల కోసం ప్రత్యేక గణన ప్రక్రియ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడు వలస కార్మికులు, తాత్కాలికంగా ఉంటున్న వారిని లెక్కించేందుకు 2027 జనగణనలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా? వారి కోసం వేరే డేటా సేకరణ ప్రక్రియ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

మంత్రి ప్రధాన సమాధానాలు:

• జనగణనలో ప్రతి వ్యక్తి గురించి గణన సమయంలో ఎక్కడ ఉన్నారో అక్కడే సమాచారం సేకరిస్తాం.

• ప్రతి వ్యక్తి వలస డేటా – జన్మస్థలం, గత నివాస స్థలం ఆధారంగా సేకరిస్తాం.

• ప్రస్తుత నివాసంలో ఎంత కాలం నుంచి ఉంటున్నారు? వలస వచ్చిన కారణం ఏమిటి? అనే ప్రశ్నలు కూడా అడుగుతాం.

• జనగణన ప్రశ్నావళి ఫీల్డ్ వర్క్ ముందు కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా నోటిఫై చేస్తుంది.

• అంటే వలస కార్మికుల కోసం వేరే ప్రక్రియ లేకుండా, సాధారణ జనగణన ప్రక్రియలోనే వారి వివరాలు సేకరిస్తారని కేంద్రం స్పష్టం చేసింది.