
జాతీయ ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేద్దాం
అధికారులంతా సమన్వయంతో పనిచేసి 28వ జాతీయ ఈ-గవరన్నెన్స్ సదస్సును విజయవంతం చేయాలని కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ నిర్దేశించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ ఇతర అధికారులతో కలిసి వారిద్దరూ కలెక్టరేట్ మీటింగు హాలులో ఆదివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం, మంగళవారం స్థానిక నోవాటెల్ హోటల్లో జరగనున్న సదస్సు నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కార్యక్రమ నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండేందుకు గాను అధిక సంఖ్యలో కౌంటర్లు పెట్టాలని, ప్రత్యేక వెబ్ లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్లో కూడా ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కంట్రోల్ రూమ్‌లో ఉండే వారు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరేం అడిగినా సమాచారం ఇచ్చేలా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ నుంచి వచ్చే అతిథులను ప్రధాన వేదికకు తీసుకురావాలని, వారికి కావాల్సిన సహాయ, సహకారాలు అందించాలని పేర్కొన్నారు. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు విజయవంతానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. సదస్సులో రాజకీయ, అధికార ప్రముఖులు భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు.
