
‘జట్టులో అందరినీ ఒకేలా చూడాలి’.. రో-కో వరల్డ్‌కప్ ఆడడంపై ధోనీ కామెంట్స్
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెక్ పెట్టారు. ఆటగాడికి వయసు అనేది ఒక అంకె మాత్రమేనని, ఫిట్‌నెస్, ప్రదర్శన మాత్రమే కొలమానాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ జతిన్ సప్రూతో జరిగిన ముఖాముఖిలో ధోనీ భారత క్రికెట్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
'రో-కో' జోడీకి ధోనీ అండ
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ (38), కోహ్లీ (37) ఆడతారా? అన్న ప్రశ్నకు ధోనీ మొదట చమత్కరిస్తూనే, తర్వాత సీరియస్ సమాధానమిచ్చారు. "వయసు అనేది అర్హత కాదు. వారు ఎప్పటి వరకు ఆడాలో ఇతరులు చెప్పకూడదు, వారే నిర్ణయించుకోవాలి. దేశం కోసం ఆడాలనే పట్టుదల ఉండి, ఫిట్‌గా ఉండి రాణిస్తున్నంత కాలం ఎవరైనా ఆడవచ్చు. నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసినప్పుడు ఎవరూ ఏమీ చెప్పలేదు. మరి ఇప్పుడు 10-20 ఏళ్ల అనుభవం ఉన్నప్పుడు కూడా వయసు గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు" అని ధోనీ తేల్చి చెప్పారు. జట్టులో అందరినీ సమానంగా చూడాలని, ఫామ్‌లో లేకపోయినా లేదా ఫిట్‌గా లేకపోయినా ఎవరినైనా పక్కన పెట్టవచ్చని, కానీ కేవలం వయసును చూసి తప్పించకూడదని ఆయన సూచించారు.
అనుభవానికి విలువ ఇవ్వాల్సిందే
జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్ల ప్రాధాన్యతను ధోనీ నొక్కి చెప్పారు. "సచిన్ టెండూల్కర్ వంటి అసాధారణ ప్రతిభావంతులు తప్ప, 20 ఏళ్ల వయసులో ఎవరికీ అనుభవం రాదు. అనుభవం అనేది ఒత్తిడిలో ఆడితేనే వస్తుంది. 20-25 మ్యాచ్‌లు ఆడితే సరిపోదు. కనీసం 80-90 మ్యాచ్‌లు ఆడితేనే గుండె వేగాన్ని, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో, ఒత్తిడిని ఎలా జయించాలో అర్థమవుతుంది. జట్టులో యువతతో పాటు అనుభవజ్ఞుల కలయిక చాలా ముఖ్యం" అని ధోనీ విశ్లేషించారు.
ప్రపంచకప్‌లో టీమిండియా ప్రమాదకరం.. కానీ!
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటి అని ధోనీ ప్రశంసించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు టైటిల్‌ను నిలబెట్టుకునే అన్ని అర్హతలు ఉన్నాయని ధోనీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇదే సమయంలో 'మంచు' ఫ్యాక్టర్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఒత్తిడిలో ఆడే అనుభవం వారికి ఉంది. కానీ, ఈ సమయంలో కురిసే మంచు ఆట గమనాన్ని మారుస్తుంది. నేను ఆడేటప్పుడు కూడా నాకు మంచు అంటే భయం ఉండేది. అది టాస్ గెలిచిన జట్టుకు ఎక్కువ అనుకూలతను ఇస్తుంది. ఆటగాళ్లెవరూ గాయపడకుండా తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే, ఈ జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదు" అని ధోనీ విశ్లేషించారు.
కామెంటరీ సెట్ కాదు: ధోనీ
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఎంచుకునే 'కామెంటరీ' బాధ్యత తనకు సెట్ కాదని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశారు. గణాంకాలను గుర్తుంచుకోవడం తనకు చాలా కష్టమైన పనని, తన సొంత రికార్డులే సరిగ్గా గుర్తుండవని ఆయన చమత్కరించారు. అంతేకాకుండా, కామెంటరీ చేసేటప్పుడు మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించాల్సి వస్తుందని, ఆ సున్నితమైన గీతను దాటడం తనకు ఇష్టం లేదని ధోనీ వివరించారు. ఫోన్లలో మాట్లాడటం కంటే ఎదురుగా కూర్చుని మాట్లాడటమే తనకు ఇష్టమని, అందుకే ఇప్పటికీ తాను ఫోన్ కాల్స్‌కు దూరంగానే ఉంటానని సరదాగా చెప్పుకొచ్చారు
