Let's talk: editor@tmv.in
జట్టుతో రోహిత్ శర్మలా వ్యవహరిస్తా: గిల్

జట్టుతో రోహిత్ శర్మలా వ్యవహరిస్తా: గిల్

Shaik Mohammad Shaffee
10 అక్టోబర్, 2025

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెలలో ఆస్ట్రేలియా పర్యటనతో తన వన్డే కెప్టెన్సీ ప్రయాణం మొదలవనుందని చెప్పారు. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో తీసుకొచ్చిన ప్రశాంతతను, స్నేహపూర్వక వాతావరణాన్ని తాను కూడా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

శుభ్‌మన్‌ గిల్ మాట్లాడుతూ, “రోహిత్ భాయ్ జట్టులో కెప్టెన్‌గా ఉన్నప్పుడు అందరికీ ఆత్మవిశ్వాసం ఇచ్చేవాడు. ఆయనలో ఉన్న ప్రశాంతత, ప్రతి పరిస్థితిని సమతుల్యంగా ఎదుర్కొనే ధోరణి నాకు ప్రేరణనిచ్చింది. అదే లక్షణాన్ని నేను కూడా జట్టులో కొనసాగించాలని భావిస్తున్నా” అని అన్నారు.

ఇప్పటికే భారత టెస్ట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న 25 ఏళ్ల గిల్, అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో తన వన్డే కెప్టెన్సీ శకానికి నాంది పలకనున్నాడు. వన్డే ఫార్మాట్‌లో దేశానికి నాయకత్వం వహించడం అనేది ఓ పెద్ద బాధ్యత అన్న గిల్, రాబోయే నెలల్లో తమ జట్టు పాల్గొనే ప్రతి టోర్నమెంట్‌లో విజయం సాధించాలనుకుంటున్నట్లు తెలిపారు.

రోహిత్, కోహ్లీ అవసరం చాలా ఉంది: గిల్

టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు దూరమైనప్పటికీ, కేవలం వన్డేల్లో మాత్రమే అందుబాటులో ఉన్న రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను శుభ్‌మన్ గిల్ కొట్టిపారేశారు. "ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. వారి లాంటి నైపుణ్యం, అనుభవం ఉన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు వారి అవసరం ఉంది" అని గిల్ చెప్పారు. గిల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, తన కొత్త కెప్టెన్సీలో సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, రోహిత్ మాదిరిగానే ప్రశాంతంగా జట్టును ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

శుభ్‌మన్‌ గిల్ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 38 టెస్టు మ్యాచ్‌ల్లో 41.49 సగటుతో 2,697 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 55 వన్డేల్లో 2,775 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, 15 అర్థ శతకాలు ఉన్నాయి. 28 టీ20ల్లో 705 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు కూడా గిల్ పేరు మీద ఉంది.

.

జట్టుతో రోహిత్ శర్మలా వ్యవహరిస్తా: గిల్ - Tholi Paluku