
జటప్రోలు ఆలయం - ఒక చారిత్రక నిర్మాణ అద్భుతం
తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన ఎన్నో పురాతన దేవాలయాలలో జటప్రోలు ఆలయం ఒకటి. కొల్లాపూర్ సమీపంలోని జటప్రోలు గ్రామంలోని ఈ ఆలయం చారిత్రక వైభవానికి, అద్భుతమైన శిల్పకళకు నిలువుటద్దం. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జలగర్భంలో కలిసిపోకుండా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తరలించబడింది. కానీ, ఆ పునర్నిర్మాణ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో జరగకపోవడం, ఆ తర్వాత ఆలనాపాలనా కరువవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.
మదన గోపాలస్వామి ఆలయం : కళా ఖండాల నిలయం
జటప్రోలులోని ప్రధాన ఆలయం శ్రీ మదన గోపాలస్వామి ఆలయం. 16వ శతాబ్దంలో సురభి వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ వాస్తు, శిల్పకళా నైపుణ్యం విజయనగర సామ్రాజ్య శైలిని పోలి ఉంటుంది. ఆలయానికి ఉన్న ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, కళాత్మక స్తంభాలు, మండపాలు చూసేవారిని ఆకట్టుకుంటాయి. ప్రతి స్తంభంపై విష్ణువు దశావతారాలు, రామాయణ, మహాభారత ఘట్టాలు, ఇతర పౌరాణిక కథలను శిల్పాలుగా చెక్కారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న భారీ చెక్క తలుపులు కళాత్మకతకు ప్రతీకలుగా నిలిచాయి. ఇక్కడ రుక్మిణీ సత్యభామ సహిత శ్రీకృష్ణుడు కొలువై ఉంటారు.
శ్రీశైలం ప్రాజెక్టుతో మరో చరిత్ర
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఆలయాన్ని ముంపు గ్రామాలైన మల్లేశ్వరం, మంచాలకోటల నుంచి తరలించారు. అప్పట్లో నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ బృహత్తర కార్యాన్ని చేపట్టారు. మద్రాసు నుంచి ప్రత్యేక శిల్పులను, స్థపతులను రప్పించి, ఆలయాలను ఒకొక్క భాగాన్ని జాగ్రత్తగా విడదీసి, జటప్రోలులో పునఃప్రతిష్ఠించారు. ఈ తరలింపులో కేవలం మదన గోపాలస్వామి ఆలయం మాత్రమే కాకుండా, అనేక శివాలయాలు, ఇతర ఉప ఆలయాలు తరలించబడ్డాయి.
ప్రస్తుత పరిస్థితి : ఆదరణ కరువైన వైనం
అయితే, పునఃప్రతిష్ఠ తర్వాత ఈ ఆలయాల నిర్వహణ పూర్తిగా విస్మరించబడింది. ప్రధాన గాలిగోపురంపై పెద్ద పెద్ద వృక్షాలు పెరిగి, గోడలు బీటలు వారాయి. ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలు ముళ్ళ పొదలతో నిండిపోయాయి. ఒకప్పుడు వేల మంది భక్తులతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తోంది. దూప, దీప, నైవేద్యాలకు నోచుకోకుండా ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని భక్తులు, చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జటప్రోలు ఆలయానికి చెందిన వందల ఎకరాల మాన్యాలు ఉండేవని, వాటి ఆదాయం ఆలయ నిర్వహణకు సరిపోయేదని స్థానికులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం అవి కూడా అన్యాక్రాంతం కావడంతో ఆలయానికి నిధులు కరువయ్యాయి.
చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
కొల్లాపూర్, జటప్రోలు ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఈ చారిత్రక ఆలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతో ఆలయాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు. ఈ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. చరిత్రకు దర్పణంగా నిలిచిన జటప్రోలు ఆలయాలు పునర్వైభవం ఎప్పుడు పొందుతాయో చూడాలి.
పర్యాటక ప్రాధాన్యత
జటప్రోలు ముఖ్యంగా రెండు ప్రధాన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది,
మదన గోపాల స్వామి ఆలయం:
16వ శతాబ్దంలో జటప్రోలు రాజులు నిర్మించిన ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం అందమైన శిల్పాలతో అలరారుతుంది. విజయనగర శైలిలో చెక్కిన స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
శివాలయాలు:
మదన గోపాల స్వామి ఆలయానికి సమీపంలో 10వ శతాబ్దానికి చెందిన ఐదు శివాలయాలు, గ్రామం లోపల 300 మీటర్ల దూరంలో మరో 20 శివాలయాలు ఉన్నాయి. ఇవి కూడా శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో తరలించబడ్డాయి.
పురాణాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని జటాయువు క్షేత్రం అని కూడా అంటారు. రావణుడు సీతను అపహరించినప్పుడు జటాయువు ఇక్కడే రావణుడితో పోరాడాడని నమ్ముతారు.ఈ ఆలయాల పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కార్తీక మాసంలో, శివరాత్రి పండుగలకు వేలాది మంది భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పర్యాటకులు ఇక్కడి చారిత్రక, మతపరమైన ప్రాధాన్యతలను తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు. జటప్రోలు ఆలయానికి ఎలా చేరుకోవాలో, దాని పర్యాటక ప్రాధాన్యత గురించి సమాచారం ఒకసారి చూద్దాం.
ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం:
హైదరాబాద్ నుండి 193 కి.మీ. దూరంలో ఉంది. నాగర్ కర్నూల్ నుండి 63 కి.మీ. దూరంలో ఉంటుంది. పెబ్బేరు జాతీయ రహదారి 7 నుండి 36 కి.మీ., కొల్లాపూర్ నుండి 16 కి.మీ., మహబూబ్‌నగర్ నుండి 158 కి.మీ. కర్నూల్ నుండి 85 కి.మీ. దూరంలో ఉంది.కొల్లాపూర్ లేదా పెబ్బేరు నుండి బస్సులు లేదా క్యాబ్‌లలో ఆలయానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం:
జటప్రోలకు సమీప రైల్వే స్టేషన్ గద్వాల్, ఇది ఆలయం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో ఉంది.
విమాన మార్గం:
సమీప విమానాశ్రయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులో నాగర్ కర్నూల్ చేరుకుని, ఆ తర్వాత జటప్రోలకు వెళ్లవచ్చు. ఈ కార్తీకమాసం లో కుటుంబంతో, స్నేహితులతో వన భోజనానికి వెళ్ళడానికి,అక్కడి ప్రదేశాలను, ప్రకృతిని ఆస్వాదించడానికి , ఫోటోగ్రఫీ కి ఈ ప్రదేశం చక్కటి ఎంపిక అవుతుంది.
