Let's talk: editor@tmv.in
జాంగ్ ఝాన్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయండి

జాంగ్ ఝాన్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయండి

Venkatesh Balusula
23 సెప్టెంబర్, 2025

వుహాన్‌లో కోవిడ్ వ్యాప్తిపై రిపోర్టింగ్ చేసి చైనా ప్ర‌భుత్వం ఆగ్ర‌హానికి గురైన ఆ దేశ‌ జ‌ర్న‌లిస్ట్ జాంగ్ ఝాన్‌కు ఐక్య రాజ్య స‌మితి మాన‌వ హ‌క్కుల కార్యాల‌యం అండ‌గా నిలిచింది. చైనా ప్ర‌భుత్వం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, జాంగ్ ఝాన్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసింది. జాంగ్ ఝాన్‌పై అభియోగాలు మోపిన చ‌ట్టాల‌పై కూడా ఐరాస తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. అస్ప‌ష్ట‌మైన చ‌ట్టాల‌తో పాత్రికేయుల స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్నార‌ని, ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని, లేదా తాత్కాలికంగా నిలిపి వేయాల‌ని డిమాండ్ చేసింది.

ఎందుకు ఈ జైలు శిక్ష‌

చైనాలో క‌రోనా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో 2020 డిసెంబ‌ర్‌లో జాంగ్ ఝాన్ కీలక అంశాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. వుహాన్‌లో క‌రోనాతో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆస్ప‌త్రుల్లో ప‌రిస్థితులు, ఖాళీ రోడ్ల దుస్థితిని సోషల్ మీడియా వేదిక‌గా వీడియోలు, ఫోటోలు, క‌థ‌నాల రూపంలో ప్ర‌పంచానికి చూపించింది. ఆ స‌మ‌యంలో చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ వివ‌రాల‌కు, జాంగ్ ఝాన్ వెల్ల‌డించిన‌ వాస్తవాల‌కు ఎంతో తేడా గుర్తించారు. చైనాలో ప‌రిస్థితుల‌పై ప్ర‌పంచ దేశాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. దీంతో చైనా ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ గొడ‌వ‌లు, పెట్ట‌డం ఇబ్బందులు క‌లిగించ‌డం అనే అస్ప‌ష్ట‌మైన ఆరోప‌ణ‌ల‌తో ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది. కేవ‌లం వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్టిన కార‌ణంగా ఒక జ‌ర్న‌లిస్టును అరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌య్యాయి. కానీ, ప్ర‌భుత్వం ఇవ‌న్నీ ప‌ట్టించుకోలేదు. అనంత‌రం మూడు నెల‌ల కిత్రం జాంగ్ ఝాన్ శిక్ష పూర్తి చేసుకొని జైలు నుంచి విడుద‌లైంది. తాజాగా ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఇవే ఆరోప‌ణ‌ల‌తో జాంగ్ ఝాన్‌కు మ‌రో నాలుగేళ్లు జైలు శిక్ష వేసింది.

ఐరాస ఆగ్ర‌హం.. ఆందోళ‌న‌

చైనా ప్ర‌భుత్వం జాంగ్ ఝాన్‌కు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించ‌డంపై ఐక్య రాష్ట్ర సమితి మానవ హక్కుల కార్యాలయం తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. జాంగ్ ఝాన్‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అస్పష్టంగా ఉన్నాయ‌ని విమ‌ర్శించింది. ఐక్యరాష్ట్ర సమితి ప్రతినిధి జెరెమీ లారెన్స్ ఈ తాజా తీర్పుపై స్పందించారు. జాంగ్‌ జైలు శిక్ష‌ తీవ్రంగా కలవరపెడుతోంద‌న్నారు. జాంగ్‌ను తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరారు. ఆమెపై ప్ర‌భుత్వం చేస్తున్న కొత్త ఆరోపణలపై ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు, వ్యాఖ్య‌ల కార‌ణంగానే ఆమెకు మ‌ళ్లీ శిక్ష విధించిన‌ట్లు ఐరాస భావిస్తోంది. దీంతో పాటు జాంగ్‌పై జ‌రుగుతున్న విచార‌ణ‌లో స్వతంత్ర పరిశీలకులను అనుమతించడంలేదు, దీంతో విచారణ న్యాయబద్ధతపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. జాంగ్‌కు రెండోసారి ఒకే ఆరోపణలతో శిక్ష పడింద‌ని లారెన్స్ పేర్కొన్నారు. జాంగ్‌తో పాటు ఇతర పాత్రికేయులు, బ్లాగర్లు, మానవ హక్కుల కార్యకర్తలపై కూడా చైనా అధికారులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఐక్యరాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కేవ‌లం స్వేచ్ఛా హక్కును వినియోగించుకున్న కార‌ణంతో ఇలా క‌ఠిన శిక్షలు అమ‌లు చేయ‌డం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఐక్యరాష్ట్ర సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్, చైనా ప్ర‌భుత్వం చ‌ట్టంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ముఖ్యంగా జాంగ్‌పై ఆరోప‌ణ‌లు చేసిన గొడవలు పెట్టి ఇబ్బందులు క‌లిగించిన అనే చ‌ట్టంతో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌న్నారు. ఈ చట్టం అస్పష్టంగా ఉండటం వల్ల సాధార‌ణ వ్య‌క్తులు, పాత్రికేయుల‌ స్వేచ్ఛను హ‌రిస్తోంద‌ని హెచ్చరించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని, లేదా తాత్కాలికంగా దీని వినియోగించ‌కుండా నిలిపివేయాలని టర్క్ పిలుపునిచ్చారు.

చైనా చ‌ట్టంలో ఏముంది?

జాంగ్ అరెస్ట్‌తో చైనాలో "గొడవలు పెట్టి, ఇబ్బందులు సృష్టించడం" అనే చ‌ట్టం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ది. దీన్ని ఆ దేశ‌ క్రిమినల్ లా కింద ఆర్టికల్ 293 ప్రకారం నేరంగా ప‌రిగ‌ణిస్తారు. ఈ చట్టం 1997లో చైనా క్రిమినల్ కోడ్‌లో చేర్చారు. ఆ తర్వాత 2015లో దీన్ని సవరించారు. 2012 చివర్లో షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ చట్టం అస్పష్టమైన, విస్తృతమైన అర్థాల‌ను కలిగి ఉంది. దీంతో అధికారులు ఇష్టారీతిన దీన్ని వర్తింపజేయడానికి అవకాశం ఉంది. ఈ చట్టం కింద సాధారణంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏడేళ్ల వరకు కూడా విధించవచ్చు. ప్రజలను రెచ్చగొట్టడం లేదా గొడవలు సృష్టించడం, బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లు చేయడం, సమాజంలో గందరగోళం కలిగించే విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అశాంతి కలిగించే కార్యకలాపాల‌న్నీ ఈ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తాయి.

చైనాలో స్వేచ్ఛా హ‌క్కుల ఉల్లంఘ‌న‌

జాంగ్ ఝాన్ ఘ‌ట‌న‌ చైనాలో స్వేచ్ఛా హక్కులు, పాత్రికేయ స్వాతంత్య్రంపై విధిస్తున్న ఆంక్ష‌ల‌ను మ‌రోసారి ప్ర‌పంచానికి తెలియ‌జేస్తోంది. వాస్త‌వాల‌ను ప్ర‌పంచానికి చెప్పే వారిని, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారిని, త‌మ‌పై విమ‌ర్శ‌లు చేసే వారిని అణ‌గ‌దొక్కేందుకు చ‌ట్టాల‌ను సాధ‌నంగా వాడి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని ఐరాస వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. గొడ‌వ‌లు పెట్టి, ఇబ్బందులు సృష్టించ‌డం అనే చట్టం అస్పష్టంగా ఉండటం వల్ల దాన్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇది పాత్రికేయులు, కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఇస్తుంది. చైనాలో డిజిటల్ స్వేచ్ఛపై కూడా ఆంక్షలు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. జాంగ్ విచార‌ణ‌లో స్వతంత్ర పరిశీలకులను అనుమతించకపోవడంతో పారదర్శకత లోపించ‌డ‌మే కాకుండా, న్యాయ వ్య‌వ‌స్థ‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో జాంగ్‌ను మొద‌టిసారి అరెస్ట్ చేసిన స‌మ‌యంల కూడా ఇలాంటి విమ‌ర్శ‌లే ఎదురైనా చైనా ప్ర‌భుత్వం వీటిని ప‌ట్టించుకోలేదు. ఇప్పుడైనా దీనిపై ప‌ట్టించుకుంటుంద‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఈ ఘ‌ట‌న‌ చైనాలో స్వేచ్ఛా హక్కుల ఉల్లంఘనలపై అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌పంచ దేశాల ఒత్తిడితో చైనా జాంగ్ ఝాన్‌ను విడుద‌ల చేస్తుందా? లేదా అన్న‌ది వేచి చూడాలి.

జాంగ్ ఝాన్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయండి - Tholi Paluku