Let's talk: editor@tmv.in
జగ్గన్న తోట ‘ప్రభల తీర్థం’ ఇక రాష్ట్ర పండుగ: సీఎం

జగ్గన్న తోట ‘ప్రభల తీర్థం’ ఇక రాష్ట్ర పండుగ: సీఎం

Panthagani Anusha
10 జనవరి, 2026

శతాబ్దాల చరిత్ర కలిగిన కోనసీమ సంప్రదాయ ఉత్సవం ‘ప్రభల తీర్థం కు రాష్ట్ర పండుగ హోదా లభించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నాథ తోట గ్రామంలో సంక్రాంతి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని ఇకపై అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు.

తరతరాల వారసత్వానికి గౌరవం

కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలకు తరతరాలుగా వారు కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలకు ఈ నిర్ణయం ద్వారా సముచిత గౌరవం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జగన్నాథ తోట ప్రభల తీర్థం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు అది కోనసీమ సాంస్కృతిక అస్తిత్వం. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఈ అద్భుత ఆధ్యాత్మిక వేడుకను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది అని ఆయన తెలిపారు.

ఈ ఉత్సవ ప్రత్యేకతను వివరిస్తూ 11 పురాతన శివాలయాల నుంచి ఉత్సవ మూర్తులు ఒకే వేదికపైకి రావడం ఈ ప్రాంతానికే గర్వకారణమని ఇదొక అపురూప ఆధ్యాత్మిక ఘట్టమని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రధానంగా వెదురు కంచెలు, రంగురంగుల కాగితాలు విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా సిద్ధం చేసే ‘ప్రభలు’ శివుని ప్రతిరూపాలుగా భక్తుల నీరాజనాలు అందుకుంటాయని ఏటా సుమారు ఐదు లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ భారీ తీర్థాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. పండుగ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, నిధుల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ నిర్ణయం వల్ల కోనసీమ ప్రాంతంలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

జగన్నాథ తోట ప్రభల తీర్థం విశిష్టత

ఈ పండుగకు సుమారు 400 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా 'కనుమ' నాడు అమలాపురం సమీపంలోని మొసలిపల్లి జగన్నాథ తోటలో ఈ అద్భుత ఆధ్యాత్మిక వేడుక జరుగుతుంది. పురాణాల ప్రకారం లోక కల్యాణం కోసం శివుని 11 రూపాలైన ‘ఏకాదశ రుద్రులు’ ఒకే చోట సమావేశమయ్యే అపురూప ఘట్టానికి ఈ తీర్థం ప్రతీకగా నిలుస్తుంది. చుట్టుపక్కల గ్రామాలలోని 11 పురాతన శివాలయాల నుంచి ఉత్సవ మూర్తులను భారీ ప్రభల రూపంలో ఇక్కడికి ఊరేగింపుగా తీసుకువస్తారు.

కాగా ఈ ప్రభల నిర్మాణం ఊరేగింపు అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే ఈ ప్రభలను వెదురు బద్దలతో గాలిగోపురం ఆకారంలో నిర్మించి, రంగురంగుల కాగితాలు,నెమలి పించాలు,పూలతో అత్యంత వైభవంగా అలంకరిస్తారు. గ్రామాల నుంచి వచ్చే ఈ ప్రభలను భక్తులు తమ భుజాలపై మోస్తూ పచ్చని పంట పొలాల గుండా పారుతున్న కాలువలను దాటించుకుంటూ జగన్నాథ తోటకు చేరుస్తారు. శివుడు తమ పొలాల గుండా వెళ్తే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని స్థానిక రైతుల బలమైన నమ్మకం.