
జగిత్యాల జిల్లాలో 300 వీధి కుక్కల మృతి.. సర్పంచ్, కార్యదర్శిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మూగజీవాలపై అమానుషం కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల తర్వాత కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. అయితే, గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కొందరు సర్పంచ్‌లు, స్థానిక నేతలు మూగజీవాల ప్రాణాలు తీస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సుమారు 300 వీధి కుక్కలను విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి అతి దారుణంగా చంపినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శిని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన జనవరి 22, 2026 మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ విషయాన్ని జనవరి 23, 2026 సాయంత్రం 6:55 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం హతిపూర్ గ్రామానికి చెందిన ముదావత్ ప్రీతి (22) ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఆమె దశరథ్ కుమార్తె.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, షేక్ జావేద్ అనే వ్యక్తి నుంచి తనకు సమాచారం అందిందని, పెగడపల్లి గ్రామంలో సుమారు 300 వీధి కుక్కలకు విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గ్రామ సర్పంచ్ (ఎ1), గ్రామ పంచాయతీ కార్యదర్శి (ఎ2)తో పాటు మరికొందరు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 325 తో పాటు 3(5)తో పాటు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 11(1)(ఏ)(ఐ) కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు చట్టబద్ధమైన మార్గాలు ఉండగా, ఇలాంటి అమానుష చర్యలు చేపట్టడం దారుణమని వారు విమర్శిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గ్రామాల్లో కుక్కల బెడద, కోతుల దాడిపై ప్రజల నుంచి ఒత్తిడి రావడం సహజం. అయితే, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలనే తొందరలో లేదా ప్రజలను మెప్పించాలనే ఉద్దేశంతో కొందరు నేతలు అత్యంత క్రూరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం జంతువులను విషం పెట్టి చంపడం శిక్షార్హమైన నేరం. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం, కోతులను అడవుల్లోకి తరలించడం వంటి శాస్త్రీయ పద్ధతులను వదిలి, చంపడమే పరిష్కారమని భావించడం అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.
మరణాల సంఖ్య 900కు చేరిందని జంతు ప్రేమికుల ఆవేదన
జగిత్యాల జిల్లా ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా చంపబడిన కుక్కల సంఖ్య 900కు చేరిందని జంతు హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జంతు ప్రేమికులు ఆరోపణల ప్రకారం, డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు గ్రామస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ చర్యలకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. వీధి కుక్కల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సర్పంచులు, ఆ తరువాత చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఈ నెలలోనే యాచారం గ్రామంలో 100 కుక్కలను విషమిచ్చి చంపినట్టు ఆరోపణలు ఉండగా, అక్కడ 50 మృతదేహాలు లభించాయి. అంతకుముందు హనుమకొండ జిల్లాలో శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో సుమారు 300 కుక్కల హత్య కేసులో ఇద్దరు మహిళా సర్పంచులు, వారి భర్తలు సహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో 200 కుక్కల మృతి ఘటనలో ఐదు సర్పంచులు సహా ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. వీధి కుక్కల సమస్యకు చట్టబద్ధ పరిష్కారాలు ఉండగా, ఇలాంటి అమానుష చర్యలు అనుమతించరాదని జంతు ప్రేమికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
