
జగన్ లండన్ విహారయాత్ర!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పదో తేదీన లండన్ బయలుదేరి వెళ్లారు. పదిహేను రోజుల విహారయాత్ర నిమిత్తం లండన్లో పర్యటిస్తున్నారు. కోర్టు నుంచి అనుమతి తీసుకున్న ఆయన లండన్‌కు పయనమయ్యారు. కోర్టు మంజూరు చేసిన గడువు ముగిసిన తర్వాత, అంటే ఈ నెల 23న ఆయన తిరిగి రానున్నారు.
నేతలకు 'రచ్చబండ' బాధ్యత
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమయంలో అధినేత జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి సమీక్షించేవారు. అయితే ఈసారి లండన్ పర్యటనకు వెళ్తూ, తాను తిరిగి వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా 'రచ్చబండ' కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ప్రజా సమస్యలపై కోటి సంతకాలు సేకరించాలని ఆయన నేతలను ఆదేశించారు. సేకరించిన ఈ సంతకాల పుస్తకాలను తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్‌కు సమర్పించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలను 'రచ్చబండ' పేరుతో ప్రజల్లోకి పంపి, తాను మాత్రం వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లడం జగన్ శైలిగా చర్చ జరుగుతోంది. అయితే, నాయకత్వం అప్పగించిన ఈ 'అసైన్‌మెంట్'ను పార్టీ నేతలు ఎంతవరకు పట్టించుకుంటారు, కార్యక్రమాలను ఎంత చురుగ్గా నిర్వహిస్తారు అన్నది చూడాల్సి ఉంది.
కోర్టు హాజరుపై సందేహాలు
లండన్ పర్యటన ముగిసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. గతంలో ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతైనా ఆయన కోర్టుకు వెళ్తారా? లేదా ఏదో ఒక సాకుతో మరోసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
