.png)
జగన్ రాజకీయ వారసులపై క్లారిటీ?
ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. యువతకు పెద్ద పీట వేస్తూ అధికార, ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. టీడీపీలో ఇప్పటికే సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ వారసులు రంగప్రవేశం చేయబోతున్నారని చర్చ మొదలైంది. జగన్ పెద్ద కుమార్తె త్వరలో పొలిటికల్ అరంగేట్రం చేస్తారని, అందుకోసమే ఆయన లండన్ వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై సంకేతాలు ఇవ్వగా, తాజాగా జగన్ కుమార్తె రాజకీయ రంగ ప్రవేశంపై వైఎస్సార్‌సీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ దంపతులు లండన్‌లో ఉండగా, వారి ఇద్దరు కుమార్తెలు—హర్షా రెడ్డి, వర్షా రెడ్డి—రాజకీయాలకు దూరంగా ఉన్నత విద్య, ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, పార్టీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీపై కొత్త చర్చ మొదలైంది.
వారసత్వ రాజకీయాలు
వైఎస్సార్ వారసులుగా జగన్, షర్మిల ఇప్పటికే రాజకీయాల్లో స్థిరపడ్డారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొని, 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. మరోవైపు, జగన్‌తో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. జగన్ తల్లి విజయమ్మ ఎక్కువగా షర్మిలతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, జగన్ పార్టీ వ్యవహారాలను ఒంటరిగా నిర్వహిస్తున్నారు.
కీలక చర్చలు
జగన్ సతీమణి భారతి రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో షర్మిల, విజయమ్మ వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారు, కానీ ఇప్పుడు వారు దూరమయ్యారు. ఈ సమయంలో, 2029 ఎన్నికల దృష్ట్యా పార్టీని బలోపేతం చేయడానికి జగన్ కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం అవసరమని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ఫ్రాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికాలోని నోట్రే డామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి, సింగపూర్‌లో ప్రముఖ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నారు.
రాజకీయ ఎంట్రీ అవకాశాలు
ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో, కుమార్తె రాజకీయ ఎంట్రీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే, జగన్ కుమార్తె 2029 ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని అంచనా. అయితే, జగన్ కుమార్తెలు రాజకీయాలపై ఆసక్తి చూపుతారా? వారు రాజకీయ రంగ ప్రవేశానికి అంగీకరిస్తారా? అలా జరిగితే, వారి రాజకీయ ఎంట్రీ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అనేది వైఎస్సార్‌సీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
