
జగన్ ఫ్లెక్సీ వద్ద వికృత చేష్టలు: ముగ్గురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్ చోడవరం గ్రామంలో చోటుచేసుకున్న జంతుబలి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన అతి ఉత్సాహం, వికృత చేష్టలు శాంతి భద్రతలకు సవాలుగా మారాయి. మద్యం మత్తులో జగన్ ఫ్లెక్సీ ముందే మేకను బలి ఇచ్చిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి గ్రామంలో పరేడ్ నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి గ్రామంలో జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గంగమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద కొందరు వ్యక్తులు మద్యం మత్తులో ఊగిపోయారు. "రప్పా రప్పా" అంటూ నినాదాలు చేస్తూ అందరూ చూస్తుండగానే ఒక మేకను నరికి ఫ్లెక్సీ ఎదుట జంతుబలి ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినప్పుడు విషయం బయటకు రానప్పటికీ, అక్కడున్న వారు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన దృశ్యాలను గమనించిన పోలీసులు తక్షణమే స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, పోలీసులు సూవో మోటోగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వైసీపీ కార్యకర్తలు కట్టుల రమేష్, పుట్ట నవీన్, కొండబట్టుల సాయిలను శనివారం అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో హింసను ప్రోత్సహించడం, జంతుబలి నిషేధ చట్టాలను ఉల్లంఘించడంపై వారిపై కేసులు నమోదు చేశారు.
అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు గ్రామ ప్రధాన రహదారిపై పరేడ్ నిర్వహించారు. రాజకీయ కార్యక్రమాల పేరుతో చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
రాజకీయ నాయకుల పట్ల అభిమానం ఉండవచ్చు, కానీ అది చట్టాన్ని ఉల్లంఘించేలా ఉండకూడదు. బహిరంగంగా జంతుబలి ఇవ్వడం అశాంతి సృష్టించడం సహించరాని నేరం అని నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జన్మదిన వేడుకల పేరుతో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటంపై స్థానిక గ్రామస్తులు సైతం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
