
జగన్ కు ఆంక్షలతో కూడిన అనుమతి
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతి ఇచ్చారు.
పర్యటన ఇలా సాగాలి
గురువారం విశాఖ చేరుకోనున్న జగన్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి. అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి. ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు.
ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు.మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు.ఊరేగింపులు, రోడ్ మార్చ్ లపై నిషేధం ఉంటుంది.
