Let's talk: editor@tmv.in
జగన్‌పై పెమ్మసాని వ్యాఖ్యలు దారుణం: వైసీపీ

జగన్‌పై పెమ్మసాని వ్యాఖ్యలు దారుణం: వైసీపీ

Panthagani Anusha
28 మార్చి, 2026

రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది. గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనుల శంకుస్థాపన వేదికగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ జాతీయ మీడియా ప్రతినిధి షేక్ మహబూబ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బహిరంగంగా హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా మాట్లాడటం ఒక కేంద్ర మంత్రికి తగదని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని షరీఫ్ డిమాండ్ చేశారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై వైఎస్ జగన్ చేసిన విమర్శలేనని తెలుస్తోంది. అంతకుముందు జగన్ మాట్లాడుతూ.. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం 'క్రెడిట్ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. 2022లో తన దావోస్ పర్యటన సందర్భంగానే ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో స్వయంగా చర్చలు జరిపి రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ స్థాపనపై ప్రాథమిక అవగాహనకు వచ్చామని ఆయన గుర్తుచేశారు. కర్నూలులో గ్రీన్‌కో ప్రాజెక్టులో రూ. 4,800 కోట్ల పెట్టుబడికి ఆ కంపెనీ అప్పట్లోనే అంగీకరించిందని అదేవిధంగా నక్కపల్లిలో స్థలాన్ని కూడా ఎన్నికలకు ముందే ఖరారు చేశామని స్పష్టం చేశారు. తాము కష్టపడి తెచ్చిన ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం సిగ్గుచేటని జగన్ ధ్వజమెత్తారు.

కేవలం ఆర్సెలర్ మిట్టల్ మాత్రమే కాకుండా నక్కపల్లిలో ఏర్పాటు కావాల్సిన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టుపై కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. రాజకీయ కక్షలతో భూవివాదాలు సృష్టించడం వల్ల ఈ భారీ ప్రాజెక్టు నిలిచిపోయిందని, దీనివల్ల వేలాది మంది యువతకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా పెమ్మసాని ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తే సహించేది లేదని, అవసరమైతే మాజీ ముఖ్యమంత్రిని హతమార్చడం తమకు పెద్ద కష్టం కాదన్నట్లుగా ఆయన మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

పెమ్మసాని వ్యాఖ్యలపై షరీఫ్ స్పందిస్తూ పెమ్మసాని అధికార మత్తులో ఊగుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు. ఆయనపై ఇలాంటి ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీకు తగిన బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. కాగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోందని అభివృద్ధి కంటే కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు.