Let's talk: editor@tmv.in
జగన్‌కు మిథున్ రెడ్డికి మధ్య పెరిగిన దూరం?

జగన్‌కు మిథున్ రెడ్డికి మధ్య పెరిగిన దూరం?

FL - SUNL
5 అక్టోబర్, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. లిక్కర్ స్కామ్‌లో 71 రోజుల తర్వాత కండిషనల్ బెయిల్‌పై విడుదలైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడం లేదు. ఇది పార్టీలో అనుమానాలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబానికి జగన్‌కు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

జైలు నుంచి విడుదలైనా మౌనమే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ నేతలు అరెస్టై జైలు పాలయ్యారు. వారిలో కొంతమందిని స్వయంగా జగన్ పరామర్శించారు. జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి తదితరులను వెంటనే పరామర్శించారు. కానీ మిథున్‌ను మాత్రం రాజమండ్రి జైలులో ఒక్కసారి కూడా పరామర్శించలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తాడేపల్లికి పిలవకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో మిథున్ (ఏ-4)పై రూ.3,200 కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. జగన్ దీన్ని రాజకీయ కక్షగా చెప్పినప్పటికీ, ఆ స్కామ్ తనకు చుట్టుకోకూడదనే వారిని దూరం పెడుతున్నారని చెబుతున్నారు.

మిథున్‌పై ఒకప్పుడు నమ్మకం, ఇప్పుడు?

వైసీపీలో సజ్జల తర్వాత జగన్‌కు అత్యంత నమ్మకస్తులు పెద్దిరెడ్డి కుటుంబమేనని అందరూ చెబుతారు. అందుకే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే పలు ఆర్థిక వ్యవహారాల్లో జగన్ సన్నిహితుడుగా మెలిగేవారు. అయితే మద్యం కుంభకోణం కేసు తర్వాత మిథున్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే మిథున్ జైలు నుంచి విడుదలైనా కలిసేందుకు సమయం ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది.

జగన్ వెంటే ఉంటాం.. మరి జగన్?

జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వెంటనే మిథున్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి తాము "జగన్ వెంటే ఉంటాం, ఆయనను సీఎంగా చేస్తాం" అని ప్రకటించారు. సీఎం చంద్రబాబు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో పెద్దిరెడ్డి ఇంటికి పరామర్శకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సహా పలువరు నేతలు క్యూ కట్టారు. అయితే జగన్ పరామర్శకు వెళ్లడం కానీ, తాడేపల్లికి పిలవడం కానీ చేయలేదు. మరోవైపు ఇటీవల మిథున్‌ను అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. అంతటి ప్రాధాన్య పోస్టును మిథున్‌కు ఇచ్చినప్పటికీ దూరమైతే పెరిగిందని ప్రచారం చేస్తున్నారు. ఈ దూరం వెనుక వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల ప్రమేయం ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్‌కు మిథున్ రెడ్డికి మధ్య పెరిగిన దూరం? - Tholi Paluku