Let's talk: editor@tmv.in
జ‌గ‌న‌న్న కాల‌నీలు ఆదాయ వ‌న‌రులుగా మారాయి

జ‌గ‌న‌న్న కాల‌నీలు ఆదాయ వ‌న‌రులుగా మారాయి

FL - BRTH
7 అక్టోబర్, 2025

జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను టీడీపీ ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్ర‌బాబు, నారా లోకేష్ ఆదాయ వ‌న‌రులుగా మార్చార‌ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి ఆరోపించారు. ఇది అబ‌ద్ధ‌మ‌ని నిరూపించుకోవాల‌ని స‌వాల్ విసిరారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న‌న్న కాల‌నీల్లో ఇంటి నిర్మాణానికి ఒక్కొక్క‌రి నుంచి రూ.10 వేలు వ‌సూలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి ప‌దివేలు వ‌సూలు చేస్తున్నామ‌ని త‌ప్పుడు ఆరోప‌ణలు చేస్తే చెప్పు తెగుతుంది అంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత తీవ్ర వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి స్పందించారు.

యాబై వేల మందికి ఇళ్లు నిర్మిస్తున్న సంస్థ‌ను ప‌నులు చేయ‌కుండా ఆపింది ప‌రిటాల సునీత కాదా అని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప‌రిటాల సునీత ఇళ్ల నిర్మాణం ఆప‌డానికి లేఖ రాశార‌ని, ఆ లేఖ‌ని వారి అనుకూల మీడియాలో కూడా ప్ర‌చారం చేసిన విష‌యం వాస్తవం కాదా అని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి అన్నారు. మ‌హిళ‌గా తాను ఏం మాట్లాడినా ఎవ‌రూ ఏమీ అన‌రు అన్న భావ‌న‌లో ప‌రిటాల సునీత ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌రిటాల సునీత‌పై తోపుదుర్తి గ్రామంలోని మ‌హిళ‌లు రెండు ట్రాక్ట‌ర్ల చెప్పులు విసిరార‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి గుర్తు చేశారు. ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో ప‌రిటాల సునీత‌కే బాగా తెలుస‌ని అన్నారు. యాబై వేల మంది ఇళ్ల నిర్మాణం ఆపిన ప‌రిటాల సునీత‌.. ఆ ల‌బ్దిదారులు చెప్పులు విసిరితే ఆ తుఫానులో కొట్టుకుపోవా అంటూ ప్ర‌కాశ్ రెడ్డి ప్ర‌శ్నించారు.

కొడుకులు, త‌మ్ముళ్లును ఉప‌యోగించి హ‌త్య రాజ‌కీయాలు చేస్తూ.. జిల్లాలో భ‌యం పుట్టించి త‌న‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రూ మాట్ల‌డ‌కుండా ప‌రిటాల సునీత చేసుకున్నార‌ని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం ఆపి, ఒక్కొక్క‌రి నుంచి రూ. 10 వేలు వ‌సూలు చేయ‌లేద‌ని నిరూపించుకోవాల‌ని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఇళ్ల నిర్మాణం ఆప‌కుంటే.. నిర్మాణ ప‌నులు మొద‌లుపెట్టాల‌ని, అడ్డుకోకుండా ఉండాల‌ని డిమాండ్ చేశారు. పేద‌ల‌కు దానం చేసే కుటుంబం అని చెప్పుకుంటున్న ప‌రిటాల సునీత ఎక్క‌డ దానం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా అడ్డుకున్నార‌ని, రైతుల పొట్ట‌కొట్టార‌ని విమ‌ర్శించారు. గుప్త నిధుల త‌వ్వకం చేసిన ఘ‌న‌త ప‌రిటాల కుటుంబానిదంటూ ఆరోపించారు.

జ‌గ‌న‌న్న కాల‌నీలు ఆదాయ వ‌న‌రులుగా మారాయి - Tholi Paluku