
జీఎస్టీ సంస్కరణల వల్ల ఎవరికి లాభం
జీఎస్టీ 2.0 అని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. రాబోయే రోజులు పేదవారికి అనుకూలంగా ఉంటాయని, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఊతం ఇస్తాయని ఓ రేంజ్లో కేంద్ర ప్రభుత్వం పీఆర్ స్టంట్లు చేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జీఎస్టీలో సంస్కరణల వల్ల ప్రజల ఆదాయంలో పొదుపు పెరుగుతుందని తెలిపారు. అలాగే దీని వల్ల ప్రభుత్వం రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం ఆదాయం కోల్పోతుందని గుర్తు చేశారు. అయినా ప్రజల జీవితాల్లో మార్పుకోసం ఈ సంస్కరణలు అవసరమని వివరించారు. అయితే ఈ సంస్కరణ వలన పేద ప్రజలు కార్లు కొనగలరా? హోటల్ కు వెళ్లి ఏసీ గదుల్లో ఉండగలరా? మంచి హోటల్ కి వెళ్లి భుజించగలరా?
ఇప్పటికే దేశ ప్రజల జేబులు గుల్ల అయ్యాయి. రైతన్నకు పంటకు పెట్టుబడి రాక, సరైన దిగుబడులు లేక, మార్కెట్ లో ధరలు లేక విలవిలాడుతున్నాడు. అలాగే ఉపాధి చేసుకునే వారు కూడా కుటుంబ పోషణకే తమ జీతం, జీవితం సరిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. పట్టణంలో ఉద్యోగం చేసే వ్యక్తి వచ్చిన జీతం మొత్తం కిరాయిలకు, ప్రయాణాల ఖర్చులకే సరిపోతున్నాయని వాపోతున్నాడు. తరచి చూస్తే మనమే ఏదైనా ఓ ఆన్లైన్ స్టోర్ లో ధరలు తగ్గాయి కదా అని ఎన్ని వస్తువులు కొనగలం. ఎంత ఖర్చుచేయగలం అన్నది తరచి చూసుకుంటే జీఎస్టీలో సంస్కరణల వల్ల ఎవరికి లాభం అన్నది తేట తెల్లమవుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేసేవే.
ధనవంతులకే లబ్ధి
జీఎస్టీ సంస్కరణ వల్ల బీహార్ లాంటి రాష్ట్రాలకు ఏం లాభం జరగదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రధాని చేసిన ప్రసంగంపై ప్రశాంత్ స్పందించారు. జీఎస్టీలో మార్పుల వల్ల ఎక్కువగా సంపన్నులకు ప్రయోజనాలు కలుగుతాయని, బీహార్ వంటి పేద రాష్ట్రాలకు ఎటువంటి లాభం చేకూర్చదని విమర్శించారు. దేశ ప్రధాని మోడీ ఇప్పటికే ఎన్నో శుష్క వాగ్దానాలు చేశారని ఎద్దేవా చేశారు. బీహార్లోని చాలామందికి కార్లు కొనే స్థొమత లేదు. ప్రతి వంద మందిలో కేవలం 2, 3 ముగ్గురికి మాత్రమే ఉంటాయి. ఈ సంస్కరణల వల్ల గరిష్ట ప్రయోజనం పొందేది ధనవంతులు మాత్రమే అని వివరించారు. అలాగే ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.
‘ప్రధాని మోడీ 15 సంవత్సరాలుగా దేశంలో మంచిరోజులు వస్తాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆయన చెబుతూనే ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం.భారత్ ప్రపంచానికి లీడర్ గా ఎదుగుతుందని, రేపు మన సమస్యలు పరిష్కారమవుతాయని, ఇప్పటి వరకు దీన్నే వింటూ వస్తున్నాం. ఎంత వరకు భారతీయుల ఆశలు నెరవేరాయన్నది ప్రజలందరికీ తెలుసు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
