Let's talk: editor@tmv.in
జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్!

జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్!

FL - SUNL
19 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభ వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ సంస్కరణలపై ప్రసంగించారు. పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జీఎస్టీ సంస్కరణల లాభాలను, వాటి ప్రభావాన్ని వివరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ, సీఎస్టీ (కమర్షియల్ ట్యాక్స్) నుంచి వ్యాట్, జీఎస్టీ వరకు పన్ను విధానాల పరిణామాన్ని వివరించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో వ్యాట్ అధ్యయనం కోసం విదేశాలకు వెళ్లిన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో వేరే రాష్ట్రాల నుంచి వస్తువులపై ఎంట్రీ ట్యాక్స్, 17 రకాల పన్నులు, 13 రకాల చార్జీలతో సంక్లిష్టతలు ఉండేవని, జీఎస్టీ అమలుతో ఈ సమస్యలు తొలగాయని, జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని తెలిపారు.

పెరిగిన పన్ను చెల్లింపుదారులు

2000లో అటల్ బిహారీ వాజ్పేయి జీఎస్టీ ఆలోచనను ప్రవేశపెట్టినప్పటికీ, తర్వాతి ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదని, నరేంద్ర మోడీ ప్రధానిగా, అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాలతో సమన్వయం చేసి జీఎస్టీని అమలు చేసినట్లు చంద్రబాబు వివరించారు. జీఎస్టీ 1.0 అమలు తర్వాత సంక్లిష్టతలు తగ్గి, ఇప్పుడు జీఎస్టీ 2.0 ద్వారా రెండు శ్లాబులు (5%, 18%) మాత్రమే ఉండేలా సరళీకరణ జరిగిందని, దీని వల్ల 140 కోట్ల మందికి లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో 12% పన్ను ఉన్న వస్తువులు సున్నా శాతానికి, 28% ఉన్న 90% వస్తువులు 18%కి తగ్గాయని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ సంస్కరణలను దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన అన్నారు. చంద్రబాబు జీఎస్టీ ప్రభావంపై గణాంకాలను ప్రస్తావిస్తూ, 2017లో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుంటే ఉంటే, ఇప్పుడు 1.51 కోట్లకు పెరిగారని, జీఎస్టీ చెల్లింపులు 202% పెరిగి, 2018లో 7.19 లక్షల కోట్లు ఉంటే 2025 నాటికి 22.08 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు.

సంస్కరణలతో సంపద సృష్టి

ఈ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి, సంపద సృష్టికి దోహదపడతాయని, దీంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యంగా సంస్కరణలు చేపట్టారని, ఇది సహకార ఫెడరలిజం విజయమని చంద్రబాబు కొనియాడారు. ఈ సంస్కరణల వల్ల రూ. 2 లక్షల కోట్ల వినియోగం నమోదవుతుందని, డిమాండ్, ఉత్పత్తి, ఉద్యోగాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పాలు, పనీర్, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు సున్నా పన్ను శ్లాబులోకి, నిత్యావసరాలు 12% నుంచి 5%కి, ఏసీలు, ఫ్రిడ్జ్లు, కార్లు 28% నుంచి 18%కి తగ్గాయని ఆయన వివరించారు. మందులు, క్యాన్సర్ చికిత్స, హెల్త్ ఇన్సూరెన్స్పై పన్ను సున్నాకి తగ్గడం వల్ల ఆరోగ్య రంగంలో గణనీయ మార్పులు వస్తాయన్నారు.ఈ సంస్కరణలు రైతులకు, ఎంఎస్ఎంఈలకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, వ్యవసాయ ఖర్చులు తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు, డిజిటల్ వ్యవస్థలు, తక్కువ సమయంలో రిఫండ్స్ వంటివి ఆర్థిక వ్యవస్థకు సూపర్ఛార్జ్గా పనిచేస్తాయని, భారతదేశం డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2047 నాటికి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్ర జీఎస్డీపీని 1.88 బిలియన్ నుంచి 2.4 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 3148 డాలర్ల నుంచి 42 వేల డాలర్లకు పెంచాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ లక్ష్యాల సాధనకు సహజ వనరులు, జియోగ్రఫిక్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ డివిడెండ్, సాంకేతికత, సంస్థాగత సంసిద్ధత ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.ఈ సంస్కరణలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని, దసరా నుంచి దీపావళి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఈ లక్ష్యంతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, 22వ తేదీ నుంచి యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్! - Tholi Paluku