Let's talk: editor@tmv.in
జీఎస్టీ సంస్కరణలపై సంబరాలు

జీఎస్టీ సంస్కరణలపై సంబరాలు

FL - SUNL
26 సెప్టెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపు జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు దసరా నుంచి దీపావళి వరకు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టే ఈ నెల 22 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని చెప్పారు. వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు వారి వారి శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి వరకూ ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తామన్నారు.

రాష్ట్రానికి నష్టమైనా ప్రజలకు మేలు

జీఎస్టీ 2.0 వల్ల రాష్ట్రానికి రూ.8 వేల కోట్లు నష్టం వాటిల్లుతున్నా ప్రజలకు ఆ మేరకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని స్వాగతించడం జరిగిందని విజయానంద్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు,మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో వివిధ అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి గురువారం జీవో జారీ చేశారు.

నెల రోజుల్లో 65 వేల కార్య‌క్ర‌మాలు

రాష్ట్ర రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నెలరోజుల ప్రచార కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ఈ నెల 25 నుంచి 29 వరకూ ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు పేరిట ప్రచార కార్యక్రమంలో భాగంగా సామాన్య ప్రజలకు గృహ, నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్యా, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి ధ‌ర‌ల‌ తగ్గింపు వల్ల కలిగే లబ్దిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 6 వరకూ వ్యవసాయం, ఇతర వృత్తుల వారికి అనగా వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధి హామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు,ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు,పేపర్‌, ప్యాకేజింగ్,సెలూన్లు, స్పా, యోగా కేంద్రాలు, జిమ్, టెక్స్ టైల్స్ రంగాల్లో పని చేసే వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అక్టోబరు 7 నుండి 13 వరకూ మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికకు సంబంధించి విద్య, జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్‌, ఇ కామ‌ర్స్ అండ్ గిగ్ ఎకానమీకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్టోబరు 14 నుంచి 18 వరకూ వికాస్ విస్వాస్-నమ్మకమైన అభివృద్ధికి సంబంధించి బిల్డింగ్, డెవలపర్స్, కనస్ట్రక్షన్ మెటీరియల్, టూరిజం, హాస్పిటాలిటీ, ట్రాన్సుపోర్టు, లాజిస్టిక్స్, బొమ్మలు, స్పోర్ట్సు గూడ్స్, రెన్యువల్ ఎనర్జీ, ఆటోమొబైల్, మాన్యూఫ్యాక్చరింగ్ రంగాల్లో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరగుతుందన్నారు. దీపావళి పర్వదినానికి ముందు రోజైన అక్టోబరు 19వ తేదీన నెలరోజుల కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామ‌న్నారు.ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల కార్య‌క్ర‌మాలు నిర్వహించ‌డం జరుగుతుందని తెలిపారు.

జీఎస్టీ సంస్కరణలపై సంబరాలు - Tholi Paluku