
జీఎస్టీ సంస్కరణలతో రూ.8 వేల కోట్ల ప్రయోజనం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎస్టీ 2.0కి సంబంధించి తెలుగులో రూపొందించిన జీవోల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ తొలిసారిగా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని 11 జీవోలను తెలుగులో జారీ చేసింది. దీని వల్ల ప్రజలు పన్నుల జీవోలను తెలుగులో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఏదైనా సమాచారాన్ని మాతృభాషలో చదివితే అది సులభంగా అర్థమవుతుందని, వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాలలోని వేలాది మంది వ్యాపారులు, అకౌంటెంట్లు, అధికారులు, ఉద్యోగులు, నిపుణులు అభినందించారని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు.ఎ తెలిపారు.
నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు అన్ని వర్గాల ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఈ సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, అదనంగా రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘ఈ జీఎస్టీ సంస్కరణలు ప్రతి ఇంటికి, రైతులకు, విద్యార్థులకు, అనేక రంగాలకు మేలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ కొత్త సంస్కరణల ద్వారా దాదాపు రూ.8,000 కోట్ల డివిడెండ్ లభిస్తుంది. జీఎస్టీ తగ్గడం వల్ల పెరిగే కొనుగోలు శక్తి ఎంఎస్‌ఎంఈ రంగానికి, ఉపాధి కల్పనకు బాగా సహాయపడుతుంది. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి కొన్ని మందులు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించారు’ అని పేర్కొన్నారు.
జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించామని, జీఎస్టీ హేతుబద్ధీకరణ సామాన్య ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని, పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
కాగా కొత్త జీఎస్టీ సంస్కరణలు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించాయి. వెన్న, నెయ్యి, పనీర్, సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీపై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. అలాగే పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పనీర్, బ్రెడ్‌లను జీఎస్టీ నుండి మినహాయించారు. మధ్య తరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కల్పిస్తూ ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. అదేవిధంగా స్వీట్స్, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
రైతులకూ ప్రయోజనాలు
రైతులకు కూడా ఈ సంస్కరణలు భారీగా మేలు చేస్తాయి. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై జీఎస్టీని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. తగ్గిన జీఎస్టీ స్లాబ్‌ల వల్ల అమ్మకాలు 5 శాతం నుండి 10 శాతానికి పెరిగి, వినియోగదారులకు లక్ష కోట్ల రూపాయల ఆదా అవుతుందని అంచనా.
సర్వీస్ సెక్టార్, హోటల్ వసతిపై జీఎస్టీ తగ్గింపు వల్ల హోటల్ ఛార్జీలు తగ్గుతాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. సంప్రదాయ కళాకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి చేనేత, చేతివృత్తుల వస్తువులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఈ సంస్కరణలన్నీ ఒక సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్‌ను సాధించడానికి సహాయపడతాయని, పేదరికాన్ని నిర్మూలించడం, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, నీటి భద్రత, రైతుల సంక్షేమం వంటి ప్రభుత్వ పది మార్గదర్శక సూత్రాలను నెరవేర్చడానికి సహాయపడతాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు.ఎ తెలిపారు.
