
జీఎస్టీ సంస్కరణలతో మధ్యతరగతికి మేలు
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఆర్థిక ఊరటను కల్పిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విద్యా సామాగ్రి వంటి 390కి పైగా వస్తువులపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గించడంతో పొదుపు పెరగనుందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రతిపక్షాలు ఈ సంస్కరణలపై విమర్శలు చేస్తున్నాయి. జీఎస్టీ పేరుతో గతంలో ధరలు పెంచి ఇప్పుడు వాటిని తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు.
50 వస్తువులకు జీరో ట్యాక్స్
నవరాత్రి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మునుపటి నాలుగు స్లాబ్‌ల నుంచి (0, 5, 12,18 , 28 శాతం ) ఇప్పుడు రెండు ప్రధాన స్లాబ్‌లు (5, 18 శాతం )కు మార్పు చేస్తూ, అల్ట్రా లగ్జరీ వస్తువులకు 40 శాతం వరకు పన్ను విధించారు. దీంతో 390కిపైగా వస్తువులు చౌకగా అందుబాటులోకి వస్తాయి. 50కి పైగా వస్తువులకు జీరో ట్యాక్స్ వర్తించనున్నది.
మధ్యతరగతికి ఎంత లాభం?
ఈ సంస్కరణలు ముఖ్యంగా మధ్యతరగతి, పేదలు, యువత, రైతులు, మహిళలకు లాభదాయకమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా తన ట్విటర్‌లో (ఎక్స్), "మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ఆదాయాన్ని పెంచడంతో పాటు, వారి పొదుపును నిరంతరం పెంచుతోంది. నిత్యావసరాలు, ఆరోగ్య ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విద్యా వస్తువులపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గడంతో వారి ఆదాయం పెరిగి, మరింత పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. పాలు, ఆహార నిత్యావసరాలు (సబ్బులు, టూత్‌పేస్ట్, షాంపూ) వంటి వస్తువులకు గత జీఎస్టీ 5-12 శాతం నుంచి ఇప్పుడు 0-5 శాతం కు తగ్గింది.’ అని అమిత్ షా పేర్కొన్నారు.
దీంతో కుటుంబానికి వారానికి రూ.500-1000 పొదుపు సాధ్యమవుతుందని కేంద్రం చెబుతోంది. ఆరోగ్య ఉత్పత్తులు, కొన్ని రకాల మెడిసిన్స్, డయాగ్నోస్టిక్ కిట్స్, ఆక్సిజన్, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ పై 12-18 శాతం నుంచి 0-5 శాతం కు తగ్గింది. వైద్య ఖర్చుల్లో సంవత్సరానికి రెండు వేల నుంచి అయిదు వేల వరకు ఆదా అవుతుందని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు (టీవీలు, ఫ్రిజ్‌లు, మొబైల్స్) 18-28 శాతం నుంచి 5-18 శాతానికి తగ్గింది. ఒక్కో కొనుగోలుపై రూ.5వేల నుంచి 15 వలే వరకు ఆదా అవుతుంది. విద్యా సామగ్రి (పుస్తకాలు, విద్యా సామగ్రి) 5-12 శాతం నుంచి 0-5 శాతంకు తగ్గింది. సంవత్సరానికి రూ.1000-3000 ఆదా అవుతుంది. ఆటోమొబైల్స్ (కార్లు, బైకులు, వాహనాలు) 18-28 శాతం నుంచి 5-18 శాతం కు తగ్గింది. వాహనం కొనుగోలుపై పదివేల నుంచి 50వేల వరకు ఆదా అవుతుంది. వ్యవసాయ ఉపకరణాలు, ఎరువులు 5-12 శాతం నుంచి 0-5 శాతంకు తగ్గింది. రైతులకు సీజన్‌కు రూ.5 వేల నుంచి -20 వేల వరకు ఆదా అవుతుంది.
ఎవరికి నిజమైన లాభం?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదలు, రైతులు, మహిళలు, యువతకు ముఖ్యంగా లాభం చేకూరే అవకాశం ఉంది. "ఆటో, వ్యవసాయ, హ్యాండీక్రాఫ్ట్స్, టాయ్స్, స్పోర్ట్స్ వంటి రంగాల్లో ధరలు తగ్గడంతో ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమవుతుంది అని అమిత్ షా తెలిపారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు మరిన్ని మార్పులు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎస్ఎంఇలు, రాష్ట్రాల అంశాలపై చర్చలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిరు వ్యాపారులకు లాభమేనా?
దేశవ్యాప్తంగా నేటి నుంచి అమలులోకి వచ్చిన 'జీఎస్టీ 2.0' సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకు పొదుపు పండుగను తీసుకువచ్చినప్పటికీ.. చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు మాత్రం తమకు పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ఎస్ఎంఈ (స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)ల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను 'బిజినెస్‌లకు ఊతం'గా ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు, వ్యాపార సంఘాలు 'అసంపూర్ణ సంస్కరణలు అంటూ విమర్శిస్తున్నారు. ఎస్ఎంఇలకు మరిన్ని పరిష్కారాలు డిమాండ్ చేస్తున్నాయి
.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 3, 2025న ప్రకటించిన ఈ సంస్కరణలు, ప్రస్తుత నాలుగు జీఎస్టీ శ్లాబులు (5, , 12 శాతం , 18 శాతం , 28 శాతం)ను మూడు స్లాబులకు (5, 18, 40 శాతం ) మార్చి, 390కి పైగా వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాయి. ఇందులో 12 శాతం స్లాబులోని వస్తువులను 5 శాతం కు మార్చడం, 28 శాతం స్లాబులోని కొన్ని లగ్జరీ వస్తువులకు 40 శాతం వరకు పెంచడం ప్రధాన మార్పులు. దీంతో రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్య ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా అందుబాటులోకి వస్తున్నాయి.
మార్కెట్ డిమాండ్ పెరుగుతుందా?
ఎస్ఎంఇలు (స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) దేశ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం జీడీపీకి, 45 శాతం ఎగుమతులకు కారణమవుతున్నాయి. జీఎస్టీ 2.0లో 12 శాతం స్లాబులోని వస్తువులను 5 శాతం కు తగ్గించడం వల్ల ఎస్ఎంఇలు తయారు చేసే ఉత్పత్తులపై (వ్యవసాయ ఉపకరణాలు, హ్యాండీక్రాఫ్ట్స్, టాయ్స్, ఆటో పార్ట్స్ వంటివి) పన్ను భారం తగ్గుతుంది. దీంతో వాటి మార్కెట్ డిమాండ్ 10-15 శాతం పెరగవచ్చని, ఫలితంగా ఆయా సంస్థల ఆర్థిక స్థిరత్వానికి దారి తీస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఎస్ఎంఇలు తయారు చేసే కిరాణా సామగ్రి (జామ్, జ్యూస్, చిప్స్, పాస్తా), వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు (హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్)పై పన్ను తగ్గడం వల్ల వీటి ధరలు 7-10 శాతం తగ్గుతాయి. ఇది ఎస్ఎంఇలకు మరిన్ని ఆర్డర్లు, మార్జిన్‌ల పెరుగుదలకు దారితీస్తుంది.
అలాగే, కాంప్లయన్స్ సరళీకరణలు (ఈ-ఇన్‌వాయిసింగ్, రిటర్న్ ఫైలింగ్ సులభత) వల్ల చిన్న వ్యాపారులకు వార్షిక ఖర్చు రూ.5వేల నుంచి 10 వేల వరకు ఆదా అవుతుందని మార్గ్ ఈఆర్‌పీ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఎస్ఎంఇలకు ఈ సంస్కరణలు స్వల్ప కాలంలో 5-10 శాతం ఖర్చు ఆదా తీసుకువచ్చినా, దీర్ఘకాలంలో మార్కెట్ విస్తరణ వల్ల 15-20 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, ప్రభుత్వం ఎస్ఎంఇలకు ప్రత్యేక నిధులు, శిక్షణ తరగతులు నిర్వహించాలనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ, ఎస్ఎంఇల అభివృద్ధికి మరిన్ని చర్యలు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రాష్ట్రాల అభ్యంతరాలు
'జీఎస్టీ 2.0' సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకు పొదుపు పండుగను తీసుకువచ్చినప్పటికీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ మార్పులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా, పన్ను రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, దీనికి పరిహారం అవసరమని ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 3న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఇంకా పరిష్కారం దొరకలేదు.
ఆదాయం నష్టపోతామంటున్న రాష్ట్రాలు
జీఎస్టీ 2.0లో 390కి పైగా వస్తువులపై (నిత్యావసరాలు, ఆరోగ్య ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైనవి) పన్ను రేట్లు 5-18శాతం తగ్గించడం, 12శాతం స్లాబ్ తొలగించడం వల్ల రాష్ట్రాలకు వార్షికంగా రూ.85వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయ నష్టం జరుగుతుందని ప్రతిపక్ష రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇది రాష్ట్రాల బడ్జెట్‌లపై ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. తమ రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ తాము జీఎస్టీ సంస్కరణల వల్ల నష్టపోతున్నామని చెబుతున్నాయి. తమ నష్టం భర్తీ చేసేందుకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్వయంగా పన్ను విధించుకొనే విధంగా రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టాలని వారు చెబుతున్నారు.
రాష్ట్రాల వారీగా నష్టం అంచనా ఇదే..
కేరళ వార్షికంగా రూ.8,000-10,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.8,000 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.15,000-20,000 కోట్లు, తమిళనాడు, మహారాష్ట్ర రూ.20,000-25,000 కోట్లు చొప్పున నష్టపోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం "ఈ సంస్కరణలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. కన్సల్మర్ డిమాండ్ పెరిగి మొత్తం కలెక్షన్ పెరుగుతుందన్నారు. హోమ్ మంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షాలు మునుపటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు జీఎస్టీకి అడ్డు పడ్డాయని గుర్తు చేశారు.
ఈ అభ్యంతరాలు జీఎస్టీ కౌన్సిల్‌లో మరిన్ని చర్చలకు దారి తీస్తాయని నిపుణులు అంచనా. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
