Let's talk: editor@tmv.in
జీఎస్టీ సంస్కరణలతో నూతన శకం: ప్రధాని మోడీ

జీఎస్టీ సంస్కరణలతో నూతన శకం: ప్రధాని మోడీ

Aravind Maryada Reddy
22 సెప్టెంబర్, 2025

దేశంలో సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ బచత్ ఉత్సవ్ (పొదుపు పండగ) ప్రారంభం కాబోతున్నదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశంలో అమలు కాబోతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో భారీ ఎత్తున జీఎస్టీ సంస్కరణలు వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ సంస్కరణలతో చాలా వస్తువుల భారతీయులు చౌకగా దొరకబోతున్నాయని పేర్కొన్నారు. ఆదాయపన్నుశాఖ మినహాయింపులతో కలిసి ప్రజలకు సంవత్సరానికి రూ.2.5 లక్షలు ఆదా అవుతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులు, ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతు ఇవ్వాలని మోడీ పిలుపునిచ్చారు. ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ సంస్కరణలను ఆవిష్కరించారు. నవరాత్రి మొదటి రోజు నుంచి అమలయ్యే ఈ సంస్కరణలు ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ అంటూ అభివర్ణించారు. అవసరమైన వస్తువులను చౌక చేసి.. మధ్య తరగతి పొదుపును పెంచి, భారత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని చెప్పారు. “రేపటి నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభమవుతుంది” అని ప్రధాని మోడీ అన్నారు. “దేశ ప్రజల పొదుపు పెరుగుతుంది. ఇష్టమైన వస్తువులను ప్రజలు సులభంగా కొనుగోలు చేయగలరు’ అని పేర్కొన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో సమాజంలోని అన్ని వర్గాలకు పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, ఎంటర్‌ప్రెన్యూర్లకు లాభదాయకమని తెలిపారు. ఈ సంస్కరణలలో సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందని, ఇందులో రెండు ప్రధాన జీఎస్టీ స్లాబ్‌లు మాత్రమే 5%, 18% ఉన్నాయని వివరించారు. గతంలో ఉన్న మల్టిపుల్ రేట్లను రద్దు చేస్తున్నామని చెప్పారు. “గతంలో 12% ట్యాక్స్ ఉన్న వస్తువుల్లో 99% ఇప్పుడు 5% స్లాబ్‌లోకి వచ్చాయన్నారు. దీంతో ఆహారం, మందులు, సబ్బులు, హెల్త్ ఇన్సూరెన్స్, రోజువారీ వస్తువులు చౌకగా లభిస్తాయని తెలిపారు. ఆర్థిక ప్రభావం గురించి మాట్లాడుతూ, ఇది పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ‘డబుల్ బొనాంజా’ అని పేర్కొన్నారు.

లక్షల మంది జీవితాలను సులభతరం చేస్తుందని చెప్పారు. స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికికు మద్దతు ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని కోరారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. పెట్టుబడులను పెంచాలని సూచించారు. ‘దేశం, రాష్ట్రాలు కలిసి పని చేస్తే, ‘ఆత్మనిర్భర్ భారత్’ కల నెరవేరుతుందన్నారు. గతంలో ఉన్న పన్నుల విధానం లోప భూయిష్టంగా ఉందని విమర్శించారు. 2017కు ముందు మన పన్నుల విధానం సరిగ్గా లేదని పేర్కొన్నారు. గతంలో పన్నులు అనేక రూపాల్లో ఉండేవని, దీని వల్ల ప్రజల మీద అదనపు భారం పడేదని చెప్పారు. అయితే ప్రస్తుతం తాము పన్నుల భారం తగ్గించి ప్రజలకు మేలు చేశామని చెప్పారు. గతంలో తీసుకొచ్చిన పన్నుల విధానం వ్యాపారులకు ఇబ్బందులు కలిగించేదన్నారు. రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాలో అనేక చెక్‌పాయింట్లు ఉండేవని, దీని వల్ల అదనపు పన్నులు ఉండేవని.. వినియోగదారులపై అదనపు భారం పడేదని చెప్పారు.

జీఎస్టీ విధానంతో ఒకే దేశం, ఒకే పన్ను కల నెరవేరిందని మోడీ పేర్కొన్నారు. సంస్కరణలు జరగడం నిరంతర ప్రక్రియ అని వివరించారు. ‘కాలం మారుతుంది. దేశ అవసరాలు మారుతాయి. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ కలలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ అవసరం. ఈ సంస్కరణలు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచుతాయని తెలిపారు. కొత్త జీఎస్టీ సంస్కరణలతో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సహాయం చేస్తాయని, రైతులకు మద్దతు ఇస్తాయని తెలిపారు. మహిళలు, యువతను సాధికారత దిశగా నడిపిస్తాయని, మధ్య తరగతిని బలోపేతం చేస్తాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగంపై రాజకీయంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఏండ్ల తరబడి ప్రజల మీద జీఎస్టీ రూపంలో పన్నులు వేసి ఇప్పుడు కొంత ఉపశమనం కల్పిస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

జీఎస్టీ సంస్కరణలతో నూతన శకం: ప్రధాని మోడీ - Tholi Paluku