Let's talk: editor@tmv.in
జంతు బయోమెట్రిక్స్ నుండి వలసదారుల భద్రత వరకు ఏఐ

జంతు బయోమెట్రిక్స్ నుండి వలసదారుల భద్రత వరకు ఏఐ

Dantu Vijaya Lakshmi Prasanna
12 డిసెంబర్, 2025

కార్నెగీ ఇండియా నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (జీటీఎస్) ఇన్నోవేషన్ డైలాగ్‌లో కృత్రిమ మేధస్సు విభిన్న వినియోగాలపై విస్తృత చర్చ జరిగింది. రైతుల జీవితాలను సులభతరం చేయడం నుండి జంతు సంరక్షణ, వలసదారుల భద్రత వంటి ముఖ్యమైన రంగాలలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నిపుణులు వివరించారు.

ముక్కు ముద్రతో జంతువుల గుర్తింపు

దక్షిణ కొరియాకు చెందిన ఐసిలాబ్ కోఆపరేషన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చాంగ్మిన్ లీ తమ వినూత్న ఏఐ సాంకేతికతనుఈ వేదికపై వివరించారు.

జంతువుల బయోమెట్రిక్స్:

కుక్కలు, పిల్లులు, పశువులు, మేకలకు వాటి ముక్కుపై ఉండే ప్రత్యేకమైన నమూనా (నోస్ ప్రింట్)ను వేలిముద్రల (ఫింగర్‌ప్రింట్స్) మాదిరిగా ఉపయోగించి వాటిని గుర్తిస్తారు. ఇది మైక్రోచిప్‌లు పనిచేయని లేదా జంతువు తప్పిపోయిన సందర్భాలలో, స్మార్ట్‌ఫోన్ ద్వారా ముక్కు ముద్రను తీసి, యజమానిని గుర్తించడానికి ఈ ఏఐ సహాయపడుతుంది.

గుర్రాలకు ప్రత్యేక విధానం:

గుర్రాలకు ముక్కుపై నమూనా ఉండదు కాబట్టి, వాటి ముఖం, శరీర ఆకృతులు, నడిచేటప్పుడు కాలు కదలికలను ఏఐ ద్వారా విశ్లేషించి ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు.

చాంగ్మిన్ లీ మాట్లాడుతూ, తమ ఏఐ వినియోగం సాంప్రదాయ పెద్ద పరిమాణ నమూనాలకు భిన్నంగా, ప్రత్యేకమైనదిగా ఉంటుందని, దీనిని ప్రపంచానికి పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

వలస కార్మికుల రక్షణకు ఏఐ చాట్‌బాట్

వలస కార్మికుల దోపిడీని అంతం చేయడానికి కృషి చేస్తున్న మైగ్రేసియా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పరాస్ కాలురా మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్లకు పైగా వలసదారులు ఉండగా, వారి దోపిడీని అరికట్టడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు. మైగ్రేసియా ఒక ఏఐ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. ఇది వలస కార్మికులతో వారి స్థానిక భాషలలో సంభాషించి, వారికి సరైన సమాచారాన్ని అందిస్తుంది. తీవ్రమైన దోపిడీ కేసులు ఉన్నప్పుడు, ఏఐ వాటిని వెంటనే మానవ నిపుణులకు (మైగ్రేషన్ స్పెషలిస్ట్‌లకు) పంపిస్తుంది.

భారతదేశంలో విస్తరణ:

ప్రస్తుతం ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వలసదారులపై ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ, మధ్యప్రాచ్యానికి వెళ్లే భారతీయ వలసదారులకు కూడా సహాయం అందించడానికి తమ నెట్‌వర్క్‌ను విస్తరించాలని చూస్తున్నట్లు కాలురా తెలిపారు.

రైతులకు విద్య, సలహాలు

కెన్యాకు చెందిన గ్రీన్ డ్రీమ్స్ టెక్ లీడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మైఖేల్ న్గుగి మిచుకి, చిన్న రైతులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించారు. స్మార్ట్‌ఫోన్‌లు లేని రైతులు కూడా ఉపయోగించే విధంగా తమ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించామని వారు తమ సాంకేతికతను ఈ వేదికపై పంచుకున్నారు. మేము రూపొందించినది ప్రశ్న ఆధారిత ఏఐ రైతులు తమ పశువుల సంరక్షణ, ఉత్తమ వ్యవసాయ పద్ధతులు లేదా వ్యక్తిగత ఆరోగ్యం గురించి ప్రశ్నలు అడగవచ్చు, దానికి ఏఐ సమాధానాలు ఇస్తుంది.

"ఇది మీ ఫోన్‌లో ఒక విశ్వవిద్యాలయం ఉన్నట్లుగా," నిపుణుల సలహాలను, ఉత్తమ పద్ధతులను రోజుకు ఐదు సందేశాల రూపంలో పంపి, రైతులకు నిరంతర విద్యను అందిస్తున్నట్లు తయారయ్యింది అని మిచుకి వివరించారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026

కార్నెగీ ఇండియా నిర్వహించిన ఈ జీటీఎస్, ఫిబ్రవరి 15 నుండి 20, 2026 వరకు న్యూఢిల్లీలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కోసం అధికారిక ప్రీ-సమ్మిట్ ఈవెంట్‌గా జరిగింది. వ్యాధి నిర్ధారణ, పంట దిగుబడుల అంచనా, విద్య అందుబాటు వంటి అనేక రంగాల్లో ఏఐ ప్రపంచాన్ని మారుస్తున్నందున, రాబోయే సమ్మిట్ భారతదేశంలో ఏఐ భవిష్యత్తుపై దృష్టి సారిస్తుంది.

జంతు బయోమెట్రిక్స్ నుండి వలసదారుల భద్రత వరకు ఏఐ - Tholi Paluku