
జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసనకు ఒక విద్యార్థి నాయకుడిగా తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనల్లో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనవద్దంటూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) యాజమాన్యం అడ్వైజరీ జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. . గత 20 రోజులుగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడం విచారకరమన్నారు.
ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని, అలాగే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపడుతున్న ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి నీట్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని మంత్రి కోరారు.
