Let's talk: editor@tmv.in
జంటనగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

జంటనగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

T Venkata Ramana
5 అక్టోబర్, 2025

జంటనగరాల్లో రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించి ట్రాఫిక్‌కు చెక్ చెప్పే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగర ప్రజా రవాణాను పూర్తిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సుల దిశగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల వ్యయాన్ని భరించేందుకు సిటీ బస్సుల్లో అదనపు సెస్సు (ఛార్జీ) విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీజీ ఆర్టీసీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెంచిన ఛార్జీలు ఈ నెల 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. నగరంలో 2027 నాటికి ఓఆర్ఆర్ లోపల 2,800 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా ఈ అదనపు భారం ప్రయాణికులపై పడనుంది.

ప్రయాణికులపై ఎంత భారం?

హైదరాబాద్‌లోని సిటీ బస్సుల్లో ప్రయాణించే పౌరులపై ఈ అదనపు సెస్సు (సర్ చార్జ్) నేరుగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులపై నెలకు గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. బస్సు సర్వీస్ రకం, ప్రయాణించే స్టేజీల పరిధికి అనుగుణంగా ఈ అదనపు ఛార్జీ (సెస్సు) లను పెరుగుతున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మొదటి 3 స్టేజీల వరకు రూ. 5 పెంచనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 4వ స్టేజీ నుంచి రూ. 10, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ మొదటి స్టేజీ వరకు రూ. 5 వరకు అదనంగా ఛార్జీ వసూలు చేయనుంది. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో రెండో స్టేజీ నుంచి రూ. 10 అదనంగా వసూలు చేయనుంది. ఈ ఛార్జీతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు యధావిధిగా ఉంటాయి. ఇది అదనంగా విధించే ఛార్జీ మాత్రమే. దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు వీటిని అదనంగా కలుపుకోవాలి.

రోజువారీ ప్రయాణికులపై భారం

రోజూ కనీసం రెండు సార్లు 4వ స్టేజీ దాటి ప్రయాణించే ( డీలక్స్,ఏసీలో 2వ స్టేజీ దాటి ప్రయాణించే) ప్రయాణికులకు నెలకు సుమారుగా రూ. 300 నుండి రూ. 600 అదనపు భారం పడే అవకాశం ఉంది. స్వల్ప దూర ప్రయాణికులకు కూడా కనీసం నెలకు రూ. 150 నుండి రూ. 300 వరకు అదనపు భారం పడుతుంది. దీంతో పాటు యథావిధిగా టికెట్ ఛార్జీ చెల్లించాల్సిందే.

మౌలిక సదుపాయాల సవాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా టీజీఆర్టీసీ నగర ప్రజా రవాణాను క్లీన్ అండ్ గ్రీన్ దిశగా మార్చడానికి సిద్ధమైంది. అయితే దీనికి భారీ స్థాయిలో ఆర్థిక భారం తప్పడం లేదు. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఈ కొత్త బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.

కొత్త డిపోలు

ప్రజా రవాణాను మరింత విస్తరించడానికి కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రానున్న సంవత్సరంలో సుమారు రూ. 392 కోట్లు ఖర్చవుతుందని టీజీఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ భారీ వ్యయాన్ని సంస్థ పూర్తిగా భరించడం కష్టం. అందుకే ప్రభుత్వం, ప్రజల సహకారం కోరుతూ ఈ అదనపు ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఆర్టీసీ చేసింది.

భారమవుతున్న మహాలక్ష్మి పథకం

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తరువాత దాని ప్రతిపాదనల మొత్తాన్ని ప్రభుత్వం నుంచి సకాలంలో అందుకోవడంలో జాప్యం కారణంగా టీజీ ఆర్టీసీ పై ఇప్పటికే గణనీయమైన ఆర్థిక భారం పడింది. దీనికి సంబంధించిన బకాయిలు కూడా సంస్థకు అదనపు ఆర్థిక సవాలుగా మారాయి.

క్లీన్ అండ్ గ్రీన్ సిటీ

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వల్ల వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా వాహనాల ఉద్గారాలు గణనీయంగా తగ్గి వాయు కాలుష్యం తగ్గుతుంది. కాలుష్యం తగ్గడం ద్వారా నగరవాసులకు శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు తగ్గి ప్రజల ఆయుర్థాయం మెరుగుపడుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడితే ట్రాఫిక్ సమస్య కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యాల సాధన కోసమే టీజీ ఆర్టీసీ అదనపు ఛార్జీల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 23న ఆమోదం తెలిపింది. ఈ పెంపును ప్రజలు 'పర్యావరణ సెస్సు' గా భావించి సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు ఒకవైపు ప్రయాణికులకు ఆర్థిక భారం అయినప్పటికీ, మరోవైపు కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ఇది ఒక అనివార్యమైన అడుగు. నగర భవిష్యత్తును మెరుగుపరిచే ఈ గ్రీన్ జర్నీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని టీజీ ఆర్టీసీ కోరుకుంటోంది.

జంటనగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు - Tholi Paluku