Let's talk: editor@tmv.in
‘జంగిల్‌రాజ్’లో బాధితులు మహిళలు, పిల్లలే : ప్రధాని మోడీ

‘జంగిల్‌రాజ్’లో బాధితులు మహిళలు, పిల్లలే : ప్రధాని మోడీ

Pinjari Chand
31 అక్టోబర్, 2025

ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది బీహార్ లో మాటల ధాటి పెరిగింది. రెండు కూటముల నాయకులు ఒకరిపైఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌లోని చాప్రా సభలో ఆర్‌జేడీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆర్‌జేడీ పాలనలో జంగిల్‌రాజ్‌ రాజ్యమేలింది. ఆ కాలంలో అత్యధికంగా మహిళలు, పిల్లలే బలయ్యారు అని వ్యాఖ్యానించారు. 1998లో జరిగిన ఒక భయంకర ఘటనను గుర్తుచేసుకుంటూ ఒక దళిత ఐఏఎస్‌ అధికారి భార్యను ఆర్‌జేడీ గుండాలు అనేక రోజులపాటు అత్యాచారం చేశారు. ఆమె అప్పటి గవర్నర్‌ రాజ్‌పాల్‌కు లేఖ రాసి ఆ దారుణాన్ని వివరించారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్‌జేడీ పాలనలో మహిళలు, కూలీలు, విద్యార్థినులు కూడా భద్రంగా లేరు అని మండిపడ్డారు. ఆ ప్రభుత్వ సమయంలో సీఎంఓ కూడా మాఫియా కేంద్రంగా మారింది. దళితులు, మహాదళితులు, వెనుకబడిన వర్గాలకి ఇలా ఏ ఒక్కరికి న్యాయం దక్కలేదు. అత్యాచార కేసులు కూడా నమోదుచేయలేదు అని మోదీ అన్నారు.

మీ తల్లిదండ్రులు ఓటు వేసి జంగిల్‌రాజ్‌ను తుదముట్టించారు. ఇప్పుడు మీరు ఓటుతో బీహార్‌ అభివృద్ధికి దోహదపడాలి. అభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మిద్దాం అని మోడీ యువతకు పిలుపునిచ్చారు. మహాఘట్భంధన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌జేడీ–కాంగ్రెస్‌ ద్వయం అభివృద్ధికి వ్యతిరేకంగా, ప్రజల విశ్వాసాన్ని అవమానపరుస్తూ, చొరబాటుదారులను రక్షిస్తోంది అని ఆరోపించారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మాణమైంది. కానీ ఆర్‌జేడీ–కాంగ్రెస్‌ నేతలు రామాలయంలో పూజలు చేయడానికి ఇంతవరకు వెళ్లలేదు. వారికి విదేశాలకి వెళ్లే సమయం ఉంటుంది. కానీ రామాలయానికి రావడానికి మాత్రం లేదు. ఛట్ పండుగను కూడా అవమానించారని మోదీ దుయ్యబట్టారు.మహాఘట్భంధన్‌ మానిఫెస్టోపై వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మానిఫెస్టో కాదు రేట్‌లిస్టు. దోపిడీ, అవినీతి, లంచగొండితనమే వారి అసలు ఉద్దేశం అని ఎద్దేవా చేశారు.

బీహారీ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది

మోడీ 2022లో జరిగిన ఒక ఘటనను గుర్తుచేశారు. అప్పుడు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఓ సభలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వాళ్లు ఇక్కడికి రాకూడదు అని చెప్పాడు. ఆ సమయంలో పక్కనే నిలబడి ఉన్న ప్రియాంకా గాంధీ సంతోషంగా నవ్వింది. అది బీహారీ ప్రజలకు జరిగిన అవమానం కాదా? అని ప్రశ్నించారు.

లాంతరు పార్టీ (ఆర్‌జేడీ), చేయి గుర్తు (కాంగ్రెస్‌) ఈ రెండు పార్టీలతో కూడిన ఇండియా కూటమి బీహార్‌ను ఎలా అవమానించిందో మర్చిపోవద్దు అని ప్రజలను ఉద్దేశించి చెప్పారు.

తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలు బీహారీ ప్రజలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు. తమిళనాడులో డీఎంకే వాళ్లు బీహార్‌ నుంచి వచ్చి కష్టపడే కార్మికులను అవమానిస్తారు. అయినా బీహార్‌లోని ఆర్‌జేడీ మాత్రం నోరు విప్పడం లేదు. ఈసారి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ అంతా బీహారిలను అవమానించడంలో దాటిపోయారు. తమ రాష్ట్రాల్లో బీహారీ ప్రజలను అవమానించిన వారినే ఇప్పుడు బీహార్‌ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. ఇది కాంగ్రెస్‌ కుట్రే.ఆర్‌జేడీకి నష్టం చేకూర్చడమే వారి అసలు ఉద్దేశం అని ఆరోపించారు.

తాను, సీఎం నితీష్‌కుమార్‌ బీహార్‌ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మీ కల — మా సంకల్పం. సుశాసనం నుంచి సుసంపన్నత వైపు బీహార్‌ పయనం ఆగకూడదు. ప్రతి ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించి అసెంబ్లీకి చేరుకోవాలి. చాప్రా వాతావరణం ఒక్కటే చెబుతోంది. ఫిర్‌ ఏక్‌ బార్‌ ఎన్డీయే సర్కార్‌ అని ప్రజలను ఉత్సాహపరిచారు.

ఈ నేల సాంస్కృతిక విలువలతో పాటు ఉద్యమాల పుట్టినిల్లు కూడా. ఇక్కడి మట్టిలో మాయ ఉంది.మాటలకే ప్రాణం పోస్తుంది. నేనూ పూర్వాంచల్‌ ప్రాంతానికి చెందిన పార్లమెంట్‌ సభ్యుడిని అని మోడీ గుర్తు చేశారు.

‘జంగిల్‌రాజ్’లో బాధితులు మహిళలు, పిల్లలే : ప్రధాని మోడీ - Tholi Paluku