
ఛత్తీస్‌గఢ్ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలోదాబజార్–భాటాపారా జిల్లాలోని ఓ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం అత్యంత వేడి బూడిద (హాట్ యాష్) కార్మికులపై పడటంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బాకులాహి గ్రామంలో ఉన్న రియల్ ఇస్పాత్ అండ్ పవర్ లిమిటెడ్ కర్మాగారంలో గురువారం ఉదయం సుమారు 9.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ దీపక్ సోనీ తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే కర్మాగారంనుంచి దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడటాన్ని దూరం నుంచే గమనించవచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, వీరిలో ఎక్కువ మంది బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులేనని వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అధిక ఉష్ణోగ్రతల బూడిదను తరలించే కిల్న్‌కు అనుసంధానమైన డస్ట్ సెటిలింగ్ చాంబర్ (డీఎస్సీ) పేలుడు కారణంగా లీక్ అయింది. ఆ సమయంలో వేడి బూడిద నేరుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడటంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డారని కలెక్టర్ తెలిపారు. గాయపడిన కార్మికులను మెరుగైన చికిత్స కోసం బిలాస్పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సీఐఎంఎస్) ఆసుపత్రికి తరలించారు. భద్రతా చర్యలలో భాగంగా ప్రమాద స్థలాన్ని సీల్ చేసి, జిల్లా యంత్రాంగం అక్కడే మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పరిశ్రమ, పారిశ్రామిక ఆరోగ్యం–భద్రత, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. ప్లాంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో పాటు, కార్మిక శాఖ అధికారులు మృతుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు చేపట్టారు.
కార్మికులను గుర్తిస్తున్నాం
జిల్లా ఎస్పీ భావనా గుప్తా మాట్లాడుతూ ఉదయం షిఫ్ట్‌లో సుమారు 50 మందికి పైగా కార్మికులు ఉన్నారని తెలిపారు. ప్రతి కార్మికుడిని ఒకరికి ఒకరుగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఘటన తర్వాత కొందరు కార్మికులు ఫ్యాక్టరీని వదిలి వెళ్లిపోయారు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగాల బృందాలు శిథిలాల తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యాయి. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనపై విచారణ చేపట్టింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాలోదాబజార్‌లోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ భయంకర పేలుడు అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖ సమయంలో వారికి అన్ని విధాల సహాయం అందిస్తాం. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆరోగ్య మంత్రి శ్యామ్ బిహారి జైస్వాల్ కూడా కలెక్టర్‌తో మాట్లాడి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
