Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్ లో 12 మంది నక్సలైట్ల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్ లో 12 మంది నక్సలైట్ల లొంగుబాటు

Pinjari Chand
9 డిసెంబర్, 2025

నక్సలైట్లకు ఛత్తీస్‌గఢ్‌లో మరో పెద్ద దెబ్బ తగిలింది. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ (ఎంసీసీ) సభ్యుడు రాంధేర్ అలియాస్ దేవు మజ్జి, అతని భార్యతో సహా మరో పది మంది నక్సలైట్లు సోమవారం రాజ్‌నందగావ్ జిల్లాలో అధికారులకు లొంగిపోయారు. పోలీసు వర్గాలు ఈ సమాచారం వెల్లడించాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో సోమవారం మావోయిస్టు సెంట్రల్ కమిటీ (ఎంసీసీ) సభ్యుడు రాంధేర్ అలియాస్ దేవ్ మజ్జీ, అతని భార్యతో కలిపి మొత్తం 12 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిపై రూ. 2.95 కోట్ల రివార్డు ఉంది. వీరు లొంగిపోయే సమయంలో 10 ఆయుధాలను అప్పగించారు. అందులో 3 ఏకే-47 రైఫిళ్లు, 3 ఇన్సాస్ , రెండు .303 రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక కార్బైన్ తుపాకీ ఉన్నాయి.

దేవ్ మజ్జీ (హొరుపు అలియాస్ అమర్‌జీత్) మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసి) జోన్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. అతని తలపై రూ. 1.05 కోట్ల రివార్డు ఉంది. అతని భార్య అనిత (అలియాస్ లలిత, జైనీ) డివిజనల్ కమిటీ సభ్యురాలు (డివిసిఎం).

లొంగిపోయిన వారిలో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, నలుగురు పార్టీ సభ్యులు, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ఏసిఎం) ఉన్నారు. నలుగురు డివిసిఎంల తలలపై ఒక్కొక్కరిపై రూ. 33 లక్షలు, ఇద్దరు ఏసిఎంలపై ఒక్కొక్కరిపై రూ. 14 లక్షలు, నలుగురు పార్టీ సభ్యులపై ఒక్కొక్కరిపై రూ. 6 లక్షల బహుమతి ఉంది. ఈ లొంగుబాట్లపై స్పందించిన ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, రెండేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలన ఛత్తీస్‌గఢ్ చరిత్రను మలుపు తిప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన 2026 మార్చి 31లోగా దేశం నక్సలైట్ ముక్తం చేయాలనే లక్ష్యం వైపు ఛత్తీస్‌గఢ్ వేగంగా అడుగులు వేస్తోంది. నక్సలిజం నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు కొన ఊపిరితో ఉందని అన్నారు. గత రెండేళ్లలో భద్రతా బలగాలు అపూర్వ విజయాలు సాధించాయి. 500కు పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించగా, 4,000కు పైగా నక్సలైట్లు లొంగిపోయారు లేదా అరెస్టయ్యారు. ఇది నక్సలిజం బలహీనపడుతున్న స్పష్టమైన సంకేతమని సీఎం విష్ణు దేవ్ సాయి పేర్కొన్నారు.

రాంధేర్ మజ్జీ (దేవ్ మజ్జీ) పూర్తి వివరాలు

రాంధేర్ మజ్జీ, అలియాస్ దేవ్ మజ్జీ, అలియాస్ సోమా, అలియాస్ హొరుపు, అలియాస్ అమర్‌జీత్ – ఈ పేర్లతో ప్రసిద్ధి చెందిన మావోయిస్టు నాయకుడు. అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు (సిసిఎం)గా పనిచేశాడు.

వ్యక్తిగత నేపథ్యం

వయస్సు: 65 సంవత్సరాలు (2025 నాటికి).

స్థానికత: ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లా స్థూరాళ్ళకు చెందిన గిరిజన (ట్రైబల్) నేపథ్యం. అతను గిరిజన సమాజం నుంచి వచ్చిన అత్యంత సీనియర్ క్యాడర్లలో ఒకరు.

ప్రవేశం: 1980లలో నక్సల్ ఉద్యమంలో చేరినట్టు రికార్డు ప్రకారం అంచనా. దశాబ్దాలుగా మావోయిస్టు ర్యాంకులలో ఎదిగాడు.

మావోయిస్టు సంస్థలో పాత్ర

హిడ్మాకు సన్నిహిత సహచరుడు కౌంటర్‌పార్ట్ గా పరిగణిస్తారు. మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసి) స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌చార్జ్. 2017లో మావోయిస్టులు ఈ జోన్‌ను బస్తార్ బయట స్ట్రాటజిక్ బెల్ట్‌గా అభివృద్ధి చేశారు. ఈ జోన్ మధ్యప్రదేశ్‌లోని బలాఘట్, మహారాష్ట్రలోని గొండియా, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ (ఉత్తర), కబీర్ధామ్, ముంగెలి జిల్లాలను కవర్ చేస్తుంది. ఇక్కడ అతను ఆయుధాలు, రిక్రూట్‌మెంట్, దాడులు, ప్రచారాలు నిర్వహించారు. సుమారు ఈయనపై 61 కేసులు ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్ లో 12 మంది నక్సలైట్ల లొంగుబాటు - Tholi Paluku