Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌ దంతేవాడలో 37 మంది నక్సల్స్ లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ దంతేవాడలో 37 మంది నక్సల్స్ లొంగుబాటు

Pinjari Chand
1 డిసెంబర్, 2025

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత అడవుల్లోని మావోయిస్టులు గుంపులు, గుంపులుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఆయుధాలతో సహ పోలీసుల ముందు లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఆదివారం 37 మంది నక్సల్స్ లొంగిపోయారు.ఇది బస్తర్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న భారీ సరెండర్లలో ఒకటిగా నమోదైంది. లొంగిపోయిన 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. పోలీస్, సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ లొంగుబాట్లు జరిగాయి. బస్తర్‌ రేంజ్‌ పోలీస్‌ చేపట్టిన “పూనే మార్గేం” (పునరావాసం నుంచి సామాజిక పునఃప్రవేశం) కార్యక్రమంలో భాగంగా వారు ప్రధాన జన జీవన ప్రవాహంలో చేరేందుకు ముందుకొచ్చారు.

లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. ముఖ్య నక్సల్‌ నాయకులు కుమాళి అలియాస్‌ అనిత మందావి, గీతా అలియాస్‌ లక్ష్మీ మడ్కం, రంజన్ అలియాస్‌ సోమ మందావి, భీమా అలియాస్‌ జహాజ్‌ కల్ము వంటి వారు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది.

ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం లొంగి పోయిన ప్రతి ఒక్కరికీ వెంటనే రూ.50,000 ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూమి కేటాయింపు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గత 20 నెలల్లో దంతేవాడ జిల్లాలో మాత్రమే 508 మంది మావోయిస్టులు హింసను వీడి జనజీవనం చేరారు. వారిలో 165 మందిపై రివార్డు ఉంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 నెలల్లో 2,200 మందికి పైగా నక్సల్స్ కీలక నేతలు, ముఖ్య క్యాడర్లు లొంగి పోయినట్లు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి. దేశం నుంచి మావోయిజాన్ని 2026 మార్చి నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

మళ్లీ జీవితం వైపు తిరిగి రండి

‘పూనా మార్గేం’ అనగా గోండి (ఆదివాసీ) భాషలో ‘మళ్లీ జీవితం వైపు తిరిగి రండి’ అని అర్థం. ఇది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ (ముఖ్యంగా బస్తర్ రేంజ్) 2021 చివరి నుంచి అమలు చేస్తున్న ఒక ప్రత్యేకమైన, అత్యంత విజయవంతమైన మావోయిస్టుల పునరావాస, సరెండర్ పాలసీ కార్యక్రమం.

పూనా మార్గేం కింద లొంగిపోయిన వారికి ఏం లభిస్తుంది?

• లొంగిపోయిన వెంటనే రూ.50,000 నగదు

• ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రివార్డు (రూ.1 లక్ష నుంచి రూ.48 లక్షల వరకు)

• మొదటి మూడేళ్లు నెలకు రూ.8,000 భత్యం

• ఉచిత నైపుణ్య శిక్షణ, పోలీస్ శాఖ(డీఆర్జీ)లో ఉద్యోగ అవకాశం

• ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు, 2-5 ఎకరాల వ్యవసాయ భూమి

• ఆయుష్మాన్ భారత్ కార్డు, పిల్లలకు ఉచిత విద్య-హాస్టల్

పూనా మార్గేం ప్రత్యేకత ఏమిటంటే, లొంగిపోయిన వారి గుర్తింపును రక్షిస్తూ, మొదటి 6-12 నెలలు సేఫ్ హౌస్‌లో ఉంచి, తర్వాత సొంత గ్రామంలోనే శాశ్వత నివాసం కల్పిస్తారు. ఆయుధాలు ఇచ్చేస్తే అదనంగా రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు ప్రోత్సాహకం కూడా ఇస్తారు.