Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు

Pinjari Chand
26 నవంబర్, 2025

బస్తర్‌ అటవీ ప్రాంతంలో నక్సలైట్ల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. మంగళవారం నారాయణపూర్‌ జిల్లాలో 28 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. అందులో 22 మంది తలం మీద మొత్తం రూ.89 లక్షల బహుమతి ఉన్నవారే కావడం విశేషం. లొంగిపోయినవారిలో 19 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్ రాజ్‌ పట్టిలింగం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ‘నియాద్‌ నెల్లనార్‌’ (మీ మంచి ఊరు) పథకం, కొత్త సర్దుబాటు–పునరావాస విధానం, అలాగే బస్తర్‌ పోలీసులు చేపట్టిన ‘పూనా మార్గం’ (సామాజిక పునరావాసం) కార్యక్రమాల ప్రభావంతోనే ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయి.

లొంగిపోయిన వారిలో

నలుగురు హార్డ్‌కోర్ కేడర్లు - డివిజనల్ కమిటీ సభ్యుడు పాండి ధ్రువ్ అలియాస్ దినేష్ (33), మావోయిస్టుల తూర్పు బస్తర్ డివిజన్‌లోని మిలిటరీ కంపెనీ నంబర్ 6కి చెందిన ముగ్గురు సభ్యులు డ్యూల్ మాండవి అలియాస్ మున్నీ (26), ఛత్తీస్ పోయమ్ (18), పద్ని ఓయం (30) వీరికి ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ప్రకటించారని ఆయన చెప్పారు.

మిగతా ఏరియా కమిటీ సభ్యులైన లఖ్ము ఉసెండి (20), సుక్మతి నూరేటి (25), సకిలా కశ్యప్ (35), శాంబట్టి షోరి (35), చైతే అలియాస్ రజిత (30), బుధ్రా రావా (28) ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బహుమానం అందజేసినట్లు తెలిపారు. లొంగుబాటు సందర్భంగా దినేష్‌ ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, లఖ్ము ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌, సుక్మతీ ఒక .303 రైఫిల్‌ పోలీసులకు అప్పగించారు.

ముగింపు దశలో మావో సిద్ధాంతం

ఈ భారీ లొంగుబాటుతో మావోయిస్టుల హింసా మార్గం క్షీణిస్తోందని ఐజీ సుందర్రాజ్‌ పేర్కొన్నారు. గత 50 రోజుల్లో బస్తర్‌ ప్రాంతంలో 512 మంది మావోయిస్టులు ప్రధాన జనజీవనంలోకి వచ్చారని తెలిపారు. నారాయణపూర్‌ ఎస్‌పీ రాబిన్సన్ గూరియా ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 287 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా ఉన్నత స్థాయి నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్ జీ, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు రామ్‌దార్, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెందిన పాపారావు, బర్సే దేవా తదితరులు కూడా హింసా మార్గం వదిలి రావాల్సిందేనని ఆయన అన్నారు.

23 నెలల్లో 2200 మంది లొంగుబాటు

23 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 2200 మంది నక్సలైట్లు, అందులో అగ్రశ్రేణి కమాండర్లు సహా, పోలీసుల ముందు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.