Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలిజం అంతానికి సంబంధించి ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. మంగ‌ళ‌వారం బీజాపూర్ జిల్లాలో 12 మంది మహిళలతో సహా మొత్తం 25 మంది మావోయిస్టు కేడర్లు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి నుంచి భారీ ఎత్తున సంపద, మారణాయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు వారి వద్ద నుంచి 7 కిలోల బంగారం, రూ. 2.92 కోట్ల నగదు, అలాగే 93 ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్ ఈ పరిణామాన్ని నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. ఈ రోజుతో బస్తర్ డివిజన్‌లో నక్సలైట్ కార్యకలాపాలు దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మేము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నాము. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి సమయం మించిపోతోంది, మా ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది 'మిషన్ 2026'లో భాగంగా సాధించిన అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.

సుక్మా జిల్లాలో మావోయిస్టు ప్రభావం శూన్యం

మరోవైపు, సుక్మా జిల్లాను మావోయిస్టుల ప్రభావం లేని జిల్లాగా ఎస్పీ కిరణ్ జి. చవాన్ ప్రకటించారు. ఎస్పీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కంపెనీ నంబర్ 8కి చెందిన ఇద్దరు మహిళా నక్సలైట్లు లొంగిపోవడంతో ఈ ఘనత సాధ్యమైందని ఆయన తెలిపారు. వీరిద్దరిపై ప్రభుత్వం రూ. 16 లక్షల రివార్డును ప్రకటించింది. వారి వద్ద నుంచి ఒక ఇన్సాస్ ఎల్ఎమ్‌జీ, రెండు ఏకే-47లు సహా 6 ఆటోమేటిక్ ఆయుధాలు, రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

గడిచిన రెండేళ్లలో భద్రతా దళాలు మారుమూల ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి నిరంతరాయంగా దాడులు నిర్వహించాయని, ఈ క్రమంలో 90 మందికి పైగా నక్సలైట్లు హతమవ్వగా, 600 మంది అరెస్టయ్యారని, 800 మంది లొంగిపోయారని చవాన్ వివరించారు.

అభివృద్ధి పథంలో బస్తర్ - అమిత్ షా ధీమా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతూ బస్తర్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించడమే కాకుండా, అక్కడ ప్రతి గ్రామంలో పాఠశాలలు, రేషన్ షాపులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు పంపిణీ చేసి సంక్షేమ పథకాలను నేరుగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శాంతిని పునరుద్ధరించడంలో భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం మరువలేనిదని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు. బస్తర్ ప్రాంతం ఇప్పుడు తుపాకుల మోత నుంచి విముక్తి పొంది, అభివృద్ధి వెలుగుల వైపు అడుగులు వేస్తోంది.