
ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో భద్రతా దళాలు కీలక పురోగతి సాధిస్తూ చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో 108 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. వీరందరిపై కలిపి రూ.3.95 కోట్ల రివార్డు ఉంది. లొంగుబాటుతో పాటు మావోయిస్టుల దాచిన నిల్వల నుంచి రూ.3.61 కోట్ల నగదు, సుమారు 1 కిలో బంగారం (విలువ రూ.1.64 కోట్లు)తో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం తెలిపారు. దేశంలో మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో ఒకేచోట ఇంత పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులు స్వాధీనం కావడం ఇదే మొదటిసారి అని చెప్పారు.
లొంగిపోయినవారు ప్రధానంగా నిషేధిత సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్ట్)కు చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులని వెల్లడించారు. వీరిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు ఉండగా, ఒక్కొక్కరిపై రూ.8 లక్షల బహుమతి ఉంది. సెక్యూరిటీ దళాలకు ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల నిల్వల నుంచి మొత్తం 101 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏకే-47, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు, లైట్ మెషిన్ గన్స్, .303 రైఫిల్స్, బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఉన్నాయి. మావోయిస్టు సిద్ధాంతంపై నమ్మకం తగ్గడం, ప్రభుత్వ పునరావాస విధానాలు ప్రభావం చూపడం వల్లే లొంగుబాట్లు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ‘పూనా మార్గం – రీహాబిలిటేషన్ టు రీజువెనేషన్’ కార్యక్రమం ప్రభావంతో పలువురు ప్రధాన ప్రవాహంలోకి రావడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రకారం, లొంగిపోయిన వారిలో ఆరు డివిజనల్ కమిటీ సభ్యులు, మూడు కంపెనీ ప్లాటూన్ కమాండర్లు, 18 మంది ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు, 23 మంది ఏరియా కమిటీ సభ్యులు, 56 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే 37 మంది బీజాపూర్ , 30 మంది దంతేవాడ , 18 మంది సుక్మా , 16 మంది బస్తర్, నలుగురు నారాయణ పూర్, ముగ్గురు కంకేర్ జిల్లాకు చెందినవారని తెలిపారు. ఇక గత 26 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 2,714 మంది మావోయిస్టులు హింసకు స్వస్తి చెప్పి ప్రధాన ప్రవాహంలోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్ డివిజన్‌లోనే 2024 జనవరి నుంచి 2026 మార్చి 9 వరకు 2,625 మంది లొంగిపోయారని అధికారులు తెలిపారు.
