
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు
వామపక్ష తీవ్రవాదానికి పెద్ద దెబ్బగా, అగ్ర మావోయిస్టు కమాండర్ పాపారావు తన 17 మంది అనుచరులతో కలిసి మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా కీలక మైలురాయిగా అధికారులు పేర్కొన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా, దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా ఉన్న పాపారావు (మంగు) దాదాపు 25 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయనతో పాటు లొంగిపోయిన 18 మందిలో 7 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజు మాట్లాడుతూ ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ. దండకారణ్య ప్రాంతంలో మొదటిసారి మావోయిస్టులు నాయకత్వం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యులు ప్రకాష్ మడ్వి, అనిల్ టట్టి వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. వారు ఏకే-47 తుపాకులు సహా పలు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇంద్రావతి–అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహించిన పాపారావు, 2010లో జరిగిన తాడ్మెట్‌ల దాడికి మాస్టర్‌మైండ్‌గా భావించబడుతున్నారు. ఆ ఘటనలో 76 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మాట్లాడుతూ ఈ లొంగుబాటు తర్వాత రాష్ట్రంలో అగ్రస్థాయి నక్సలైట్ నాయకత్వం లేకుండా పోతుంది. మార్చి 31, 2026 నాటికి రాష్ట్రాన్ని పూర్తిగా నక్సలిజం రహితంగా మార్చే లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. మావోయిస్టు ఉద్యమం ఒకప్పుడు ‘రెడ్ కారిడార్’పేరుతో బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించినా, ప్రస్తుతం భద్రతా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస పథకాల ప్రభావంతో క్షీణిస్తోంది. 2014 నుంచి 2026 ప్రారంభం వరకు దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 2025లోనే 2,300 మంది, 2026 తొలి మూడు నెలల్లో 630 మందికి పైగా ఆయుధాలు వదిలారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న ‘సమాధాన్’ వ్యూహం ద్వారా ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు, మౌలిక సదుపాయాల విస్తరణ, పోలీసు వ్యవస్థ ఆధునీకరణ చేపట్టడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, గృహ సదుపాయం వంటి ప్రయోజనాలు కల్పించే పునరావాస పథకాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అధికారుల ప్రకారం, మిగిలిన కొద్దిమంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గడ్చిరోలి, తెలంగాణ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్నారు. వారు కూడా త్వరలో ప్రధాన ప్రవాహంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
