Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Shaik Mohammad Shaffee
17 నవంబర్, 2025

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్ సుక్మా జిల్లాలోని చింతగుఫా-భేజ్జి పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లోని దట్టమైన తుమల్పాడు అటవీ ప్రాంతంలో జరిగింది. మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా నిఘా సమాచారం మేరకు డీఆర్‌జీ దళాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టాయి. బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు సుక్మా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ వెల్లడించారు.

మృతి చెందిన మావోయిస్టుల వివరాలు

ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టులను అధికారులు గుర్తించారు. మృతి చెందిన వారిలో మిలిషియా కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడైన మద్వి దేవా, సీఎన్ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి గంగి ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. వీరంతా గతంలో అమాయక ప్రజలపై జరిగిన అనేక దాడులలో పాలుపంచుకున్నారని తెలిపారు. మావోయిస్టుల నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు, ఇతర కీలక ఆయుధాలు ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

2026 నాటికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా చర్చలకు తావు లేదని తేల్చిచెప్పిన కేంద్రం.. మావోయిస్టులను వరుస ఎన్‌కౌంటర్లలో ఏరిపారేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు సహా భారీగా క్యాడర్‌ ఆయుధాలతో సహా లొంగిపోయారు. కాగా ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన నక్సలైట్ల సంఖ్య 262కు చేరింది. సుక్మాతో సహా ఏడు జిల్లాలను కలిగి ఉన్న బస్తర్ డివిజన్‌లో 233 మంది నక్సలైట్లు హతమయ్యారు. రాయ్‌పూర్ డివిజన్‌లోని గరియాబంద్ జిల్లాలో 27 మంది నక్సలైట్లు మరణించారు. దుర్గ్ డివిజన్‌లోని మొహ్లా-మాన్‌పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారు. బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్ మాట్లాడుతూ, భద్రతా దళాల పట్టుదల ముందు మావోయిస్టుల వ్యూహాలు విఫలమవుతున్నాయని, నక్సలిజం అంతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.