Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు హతం

Shaik Mohammad Shaffee
19 డిసెంబర్, 2025

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపిన వివరాల ప్రకారం, గోలాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులతో నిండిన కొండ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం అందడంతో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గాలింపు సమయంలో ఉదయం ఒక్కసారిగా నక్సలైట్లు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుదాడికి దిగాయి. కొంతసేపు కాల్పులు కొనసాగిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటన స్థలం నుంచి ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ తాజా ఘటనతో కలిసిఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 284 మంది నక్సలైట్లు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. వాటిలో, బస్తర్ డివిజన్‌లో (సుక్మా, బీజాపూర్, దంతేవాడా తదితర 7 జిల్లాలు) 255 మంది నక్సలైట్లు మృతి చెందారు. రాయ్‌పూర్ డివిజన్‌లోని గారియాబంద్ జిల్లాలో 27 మంది నక్సలైట్లు కాల్పుల్లో చనిపోయారు. దుర్గ్ డివిజన్‌లోని మొహ్లా–మాన్‌పూర్–అంబాగఢ్ చౌకి జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పునరుద్ధరణే లక్ష్యంగా భద్రతా బలగాలు నిరంతరం గాలింపు చర్యలు, ఆపరేషన్‌లు కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మార్చి 2026 నాటికి దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ దాడులను ఉధృతం చేశాయి. ప్రస్తుతం గొల్లపల్లి అడవుల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు హతం - Tholi Paluku