
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.5 లక్షల బహుమతి ఉన్న మహిళా మావోయిస్టు సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు రూపి అనే మహిళా మావోయిస్ట్‌గా గుర్తించారు. ఆమె మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చివరి సీనియర్ తెలుగు కేడర్ ఆమెనే కావచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన రాష్ట్రాన్ని మార్చి 31న సాయుధ మావోయిస్టుల నుంచి పూర్తిగా విముక్తం చేశామని ప్రభుత్వం ప్రకటించిన 12 రోజుల తర్వాత చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసుల సమాచారం ప్రకారం, చోటేబెథియా–పార్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక సమాచారం అందడంతో భద్రతా బలగాలు సోమవారం ఉదయం యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఎన్‌కౌంటర్ అనంతరం రూపి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో పిస్టల్, పేలుడు పదార్థాలు సహా ఇతర సామగ్రి కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల ప్రకారం రూపి, డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు విజయ్ రెడ్డి భార్య. గత ఏడాది మన్పూర్–మోహ్లా–అంబాగఢ్ చౌకి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విజయ్ రెడ్డి మృతి చెందాడు.
ప్రధాన ప్రవాహంలోకి రావాలి
పి.సుందర్‌రాజ్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వదిలి లొంగిపోవాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోందన్నారు. పునరావాస పథకాల కారణంగా ఇటీవల చాలా మంది మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి తిరిగి వస్తున్నారని తెలిపారు. అయితే రూపి వంటి కొందరు ఇంకా హింసాత్మక మార్గాన్నే ఎంచుకోవడం వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. మిగిలిన మావోయిస్టులు కూడా హింసను విడిచిపెట్టి ప్రధాన ప్రవాహంలోకి రావాలని మరోసారి పిలుపునిచ్చారు. శాంతియుత జీవితం ఎంచుకునేందుకు వారికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 285 మంది మావోయిస్టులు హతమయ్యారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026ను గడువుగా నిర్ణయించింది.
