
ఛట్ పూజ - గంగా తీరాన భక్తి స్రవంతి
భారతదేశంలో కార్తీక మాసంలో అత్యంత భక్తి భావంతో జరుపుకునే పండుగల్లోఛట్ పూజ ఒకటి. ఈ ఛట్ పూజను ధళ ఛట్, ఛతి, సూర్య షష్టి, అని కూడా అంటారు. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్య భాగవానుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ చేసుకునే పండుగ ఇది. ఇలా పూజించడం వల్ల దీర్ఘకాలిక వ్యాదులు కూడా నయమవుతాయని మనదేశంలో ఉత్తరాది ప్రజలు బాగా నమ్ముతారు. కానీ ఈ పండుగకు గుండె బీహార్ ఉత్తరప్రదేశ్. ఇది కేవలం పండుగ కాదు. గంగానది తీరంలో జన్మించిన ఒక జీవనసంస్కృతి, సూర్యారాధనతో ముడిపడిన పుణ్యప్రవాహం, మాతృభక్తి, త్యాగం, కృతజ్ఞతల ప్రతిరూపం.
సూర్య భగవానుడికి అంకితం అయిన పవిత్రమైన ఈ ఛట్ పూజను పురాణాల ప్రకారం పాండవులు, ద్రౌపతి, చేసినట్లు కథనాలు ఉన్నాయి. బీహార్ తోపాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాంచీ, డిల్లీ ముంబై లలో అక్కడక్కడ జరుపుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వాళ్లు కూడా ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ పండుగ కార్తీక మాసం శుక్ల షష్టి నాడు సూర్యుణ్ణి ఆరాదిస్తూ చేసే పండుగ కాబట్టి శుక్ల షష్టి అని కూడా అనడం జరుగుతుంది. సూర్యుడికి నైవేద్యం సమర్పించి కృతజ్ఞతలు తెలపడం ఈ పూజలో ముఖ్య ఉద్దేశం. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో భక్తులు కఠినమైన నియమాలు పాటిస్తూ నిర్జల ఉపవాసం చేస్తారు. అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం కొనసాగిస్తారు.
భూమి, నది, సూర్యుడు - బిహారీ భక్తుల జీవిత త్రివేణి
బీహార్ ప్రజల జీవితంలో గంగానది, సూర్యదేవుడు, ప్రకృతి అణువణువులో నిండి ఉన్నాయి. సూర్యుడు పంటకు కాంతినిస్తాడు, గంగానది జీవానికి ఆత్మ. ఈ రెండింటికీ కృతజ్ఞత తెలపడం, జీవితం ఇచ్చిన వరాలకి నమస్కరించడం అదే ఛట్ పూజ ఆచారం. ఈ పండుగలో ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పసిడి కాంతులతో నిండిపోతుంది. నదీ తీరాలు దీపాల వెలుగులో స్వర్గంలా మారిపోతాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో నదిలో నిలబడి సూర్యుడికి నీటిని అర్పించే క్షణం, అది మాటల్లో చెప్పలేని పవిత్ర అనుభూతి.
నాలుగు రోజుల ఛట్ పూజ - భక్తి, నియమం
1వ రోజు - నహాయ్ ఖాయ్: పండుగ ప్రారంభం. భక్తులు నదిలో స్నానం చేసి పవిత్రతను సంపాదిస్తారు. ఆ రోజు వారు “సత్యాహారం”అంటే శుద్ధమైన, దేవుడి నామంతో తయారైన ఆహారమే తింటారు. బీహార్ గ్రామాలలో ఈ రోజున ప్రతి ఇల్లు ధూపం, దీపం, పువ్వులతో సుగంధభరితమవుతుంది. మహిళలు తమ ఇంటిని పవిత్రం చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఆత్మశుద్ధి పర్వదినం.
2వ రోజు - ఖర్ణా: ఈ రోజు సాయంత్రం వరకు ఉపవాసం. సూర్యుడు అస్తమించాక గుర్ (బెల్లం) పాయసం, రొట్టె, పాలు, ఫలాలుతో పూజ చేసి ఆహారం తీసుకుంటారు. ఇది కుటుంబ ప్రేమకు, మాతృభక్తికి ప్రతీక. మహిళలు ఈ రోజు “హమార్ సూరజ దేవా, కుటుంబ కే సుఖ శాంతి దే” అని ప్రార్థిస్తారు. అంటే, “ఓ సూర్యదేవా! నా కుటుంబానికి శాంతి ఇవ్వు.” అని అన్నమాట.
3 వ రోజు - సాంఝా అర్ఘ్య: సాయంత్రం గంగాతీరాలు భక్తి దీపాలతో ప్రకాశిస్తాయి. పసిడి సూర్యుడు నెమ్మదిగా అస్తమించేటప్పుడు, వ్రతధారిణులు గంగానదిలో నడుము వరకూ నీటిలో నిలబడి, బాంబూ దౌరాలో పండ్లు, అరటిపళ్లు, కొబ్బరికాయలు, బెల్లం వంటకాలు ఉంచి సూర్యునికి నీటిని అర్పిస్తారు. గాలిలో “చఠి మయా కే జై” అంటూ గానాలు మార్మోగుతాయి. ఆ క్షణం బీహార్ ప్రజల హృదయంలో అంతులేని ఆత్మీయత, భక్తి, గౌరవం ప్రతిబింబిస్తుంది. ఛట్ పూజ మూడవ రోజున అస్తమించే సూర్యుడికి 'అర్ఘ్యం' సమర్పించడానికి మహిళలు థేకువా ప్రసాదాన్ని సిద్ధం చేస్తారు
4వ రోజు - ఉదయ అర్ఘ్య: ఆ రోజు తెల్లవారుజామున వ్రతధారిణులు మళ్లీ గంగానదిలో నిలబడి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఆ క్షణం భూమి నిశ్శబ్దంగా ఉంటుంది. గంగానది తేలికగా ప్రవహిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, వ్రతధారిణుల కన్నీరు కృతజ్ఞతగా నీటిలో కలుస్తుంది. ఇది కేవలం పూజ కాదు. ప్రకృతితో మనసు మాట్లాడే సమయం. సూర్యుడు ఉదయించగానే వ్రతధారిణులు నమస్కరించి, ఉపవాసాన్ని ముగిస్తారు.
ఛట్ పూజలో మహిళా శక్తి
ఛట్ పూజలో ప్రధాన పాత్ర మహిళలది. వారు కేవలం కుటుంబం కోసం కాదు. ప్రకృతికి ధన్యవాదంగా, సమాజానికి శాంతిగా ఈ వ్రతాన్ని చేస్తారు. బీహార్ గ్రామాల్లో “చఠి మాయా” పట్ల ఉన్న విశ్వాసం అద్భుతం. (చఠి మయా మా సూరజ్ కా రోషనీ సే హమారా జీవన్ బసా బా) చఠి తల్లి సూర్యకాంతితోనే మన జీవితం నడుస్తుంది. ఇది మహిళా భక్తి, త్యాగం, క్రమశిక్షణకు ప్రతీక. ఈ పూజ చేసేవారు దీక్ష బూని 36 గంటలు నీరుకూడా తీసుకోకుండా ఉంటారు. ఆడంబరాలకు దూరంగా నేలమీద పడుకుంటారు.
నిర్జల ఉపవాసం: 36 గంటలు నిర్జల ఉపవాసం సులభమైనది కాదు. శరీరానికి తగిన శక్తి, తేమ ఉండకపోతే అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఉపవాసం ప్రారంభించే ముందు శరీరాన్ని సరిగా సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం గా బావిస్తారు. చాలామంది నిర్జల ఉపవాస సమయంలో తల తిరగడం లేదా బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల ఉపవాసానికి ముందు బెల్లం నీరు తాగితే ఉపవాస సమయంలో అలసట తక్కువగా ఉంటుందని దీన్ని తీసుకుంటారు. అలాగే ముందు రోజు కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు తీసుకుంటారు. కేవలం ఆహారమే కాకుండా విశ్రాంతి కూడా ముఖ్యమని బావించి శ్రద్ధగా నిష్టగా ఇవన్ని పాటిస్తారు. దీనివల్లే వీరు నిర్జల ఉపవాసం సులభంగా చేస్తారు. ఛట్ పూజలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి అర్పణలు చేస్తారు. అందువల్ల భక్తులు శారీరకంగా సిద్ధంగా ఉండటం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పటిష్టంగా అనుభవించడానికి తోడ్పడుతుందని వీరి నమ్మకం.
ఉత్తరప్రదేశ్‌లో ఛట్ పూజ - గంగాతీరాల మహోత్సవం
ఉత్తరప్రదేశ్‌లో వారాణాసి, మిర్జాపూర్, బల్లియా, గాజీపూర్, గోరఖ్‌పూర్ ప్రాంతాలు ఛట్ పూజలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి. గంగానది, ఘాట్‌లు, దీపాల వెలుగులు, సూర్యకాంతి ప్రతిబింబాలు. ఇవన్నీ కలిసినప్పుడు ఆ వాతావరణం దేవతామయంగా ఉంటుంది.సాయంకాలం గంగాతీరాల దగ్గర వేలాది మహిళలు వరుసగా నిలబడి సూర్యుడికి నీటిని అర్పించే దృశ్యం, ఇది ఉత్తరప్రదేశ్ ఆత్మను ప్రతిబింబించే భక్తి క్షణం.
ఛట్ పూజ సారాంశం
ఛట్ పూజ మనకు నేర్పేది ఒకే విషయం ఒక్కటే. ప్రకృతిని గౌరవించు, కృతజ్ఞతతో జీవించు. ఇది ధనసంపత్తి పండుగ కాదు, ఇది ఆత్మశాంతి పండుగ. గంగానది తీరం మీద వెలిగే ప్రతి దీపం ఒక ప్రార్థన “మనసులో వెలుగు రావాలి” అనే సందేశం. ఛట్ పూజ బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజల గుండెల్లో ఆత్మీయత, గౌరవం, భక్తిగా నిలిచిపోయింది. ఇది వారి జీవన శైలిలో భాగం, వారి గుర్తింపు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ ఛట్ పూజ వస్తుంది, అంటే గంగానది తీరాలు మళ్లీ మెలకువ చెందుతాయి. సూర్యుడు మరింత కాంతివంతం అవుతాడు. మహిళల మనసులు మరింత పవిత్రం అవుతాయి.
