
చొరబాట్లను అడ్డుకోవడం కేంద్ర బాధ్యత:టీఎంసీ
రానున్న రోజుల్లో 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు సమగ్ర జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడతామని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అంశంపై రాజకీయంగా విమర్శలు పెరిగాయి. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ధ్వజమెత్తింది. టీఎంసీ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ఆదివారం తీవ్రస్థాయిలో కేంద్రాన్ని, ముఖ్యంగా కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. బీజేపీ విధానాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు వారు ‘అఖండ భారత్’ గురించి మాట్లాడుతారు. మరోవైపు దేశంలో చొరబాటుదారులు పెరిగిపోతున్నారంటారు. మరి వారిని ఆపలేకపోయామంటారు. దేశ సరిహద్దుల భద్రత, బాధ్యత ఎవరిది? అది కేంద్ర మంత్రిగా అమిత్ షా దే. ఇది మీ వైఫల్యం. మీరు నిజంగా అఖండ భారత్ కావాలనుకుంటే ఈ సర్ ఎందుకు? అని ఘోష్ ప్రశ్నించారు.
సర్ భయంతో ఆత్మహత్యలు
బీజేపీ ఆదేశాలతో సర్ పేరుతో ఈసీ అమలు పరుస్తున్న ఓటర్ల సమగ్ర జాబితా సవరణ పట్ల ప్రజలలో భయానక వాతావరణం నెలకొంటోందని టీఎంసీ ఆరోపిస్తోంది. కొన్ని రోజుల్లోనే బెంగాల్‌లో పలువురు ఆత్మహత్య చేసుకుని మరణించారని వివరించింది.
ప్రదీప్ కార్ (పనిహాటి) — ఎన్ఆర్సీ భయంతో ఆత్మహత్య.
జిత్‌పూర్ (కూచ్‌బెహార్) — సర్ వేధింపుల భయంతో ఆత్మహత్యాయత్నం.
ఖితీష్ మజుమ్దార్ (బీర్భూమ్) — 95 ఏళ్ల వృద్ధుడు భయంతో ఆత్మహత్య.
బిమల్ సంత్రా (పుర్బ బర్దమాన్) — వలస కార్మికుడు, భయంతో మరణం.
ఇది బీజేపీ ద్వేష రాజకీయాలకు పరాకాష్ట. ప్రజల పౌరసత్వంపై అనుమానం రేకెత్తించి, భయంతో నివసించే పరిస్థితి సృష్టిస్తున్నారు. ఇది మానవతకు వ్యతిరేకమైన చర్య అని టీఎంసీ ఎక్స్ లో వ్యాఖ్యానించింది.
నవంబర్ 4న సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ర్యాలీ
ఈ నేపథ్యంలో నవంబర్ 4న సర్ కు వ్యతిరేకంగా కోల్‌కతాలో టీఎంసీ మహా నిరసన ర్యాలీ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గోననున్నారు.
టీఎంసీ అధికారిక ప్రకటన
“ఈ సర్ అనేది అసలు ‘సైలెంట్ ఇన్‌విజిబుల్ రిగ్గింగ్’. అర్హులైన ప్రతి ఓటరును చేర్చేందుకు, అర్హత ఉన్న ఏ ఒక్కరిని జాబితాను తొలగించకుండా చూసేందుకు మేము పోరాటం కొనసాగిస్తాం. ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతాం. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ఎన్ఆర్సీ, సీఏఏ అంశాలపై బీజేపీ-టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సర్ అంశంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. టీఎంసీ ప్రజల హక్కుల రక్షణ పేరుతో ర్యాలీలు తీయడానికి ప్రయత్నం చేస్తోంది. బీజేపీ సర్ ఒక సాధారణ ఓటర్ల జాబితా సవరణ మాత్రమ అని వివరణ ఇస్తోంది. అయితే ప్రజల మధ్య వ్యాప్తి చెందుతున్న భయం, అనుమానం చూస్తే... ఈ వ్యవహారం కేవలం పరిపాలనా చర్యగానే ముగుస్తుందా? లేక రాజకీయంగా మరింత చిచ్చు రేపుతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
